జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో 4.84 కోట్ల యూనిట్ల షిప్పింగ్
న్యూఢిల్లీ: ఈ ఏడాది మూడో త్రైమాసికంలో దేశీయంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 3 శాతం వృద్ధి చెందింది. 4.84 కోట్ల యూనిట్లు ఫ్యాక్టరీల నుంచి డిస్ట్రిబ్యూటర్లకు సరఫరా అయ్యాయి (షిప్పింగ్). మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఓమ్‌డీయా నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. జూలై, ఆగస్టులో కొత్త ఫోన్ల ఆవిష్కరణ, డిస్కౌంట్లు, పండగల సీజన్ ముందుగా రావడం వంటి అంశాలు ఇందుకు తోడ్పడ్డాయి. పండగ డిమాండ్ భారీగా ఉంటుందనే అంచనాలతో వెండార్లు కొత్త స్టాక్స్‌ను పెద్ద ఎత్తున నిల్వ చేసుకున్నారు.
వినియోగదారుల డిమాండ్ మెరుగుపడటం కన్నా ప్రోత్సాహకాల ఆకర్షణ వల్లే మూడో త్రైమాసికంలో అమ్మకాల వృద్ధి నిలకడగా నిలబడినట్లు నివేదిక పేర్కొంది. రిపోర్ట్ ప్రకారం 97 లక్షల యూనిట్ల షిప్పింగ్, 20 శాతం మార్కెట్ వాటాతో వివో (ఐక్యూని మినహాయించి) అగ్రస్థానంలో నిలి్చంది. 68 లక్షల యూనిట్లు, 14 శాతం మార్కెట్ వాటాతో శాంసంగ్ రెండో స్థానం దక్కించుకుంది. సుమారు 65 లక్షల యూనిట్ల షిప్పింగ్‌తో షావోమీ, ఒప్పో (వన్‌ప్లస్ కాకుండా) వరుసగా తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఇక 49 లక్షల ఫోన్ల షిప్పింగ్‌తో యాపిల్ తిరిగి టాప్ 5లో చోటు దక్కించుకుంది. భారత్‌లో క్యూ3లో కంపెనీ అత్యధికంగా షిప్‌మెంట్స్ నమోదు చేసుకుంది. 10 శాతం మార్కెట్ వాటా దక్కించుకుంది.


