
న్యూఢిల్లీ: ఈ ఏడాది (2025) తొలి త్రైమాసికంలో నెమ్మదించిన దేశీ స్మార్ట్‌ఫోన్ల మార్కెట్ రెండో త్రైమాసికంలో పుంజుకుంది. మొత్తం స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు పరిమాణంపరంగా ఎనిమిది శాతం, టోకు అమ్మకాలు విలువపరంగా 18 శాతం పెరిగాయి. అత్యధికంగా ఐఫోన్ 16 టోకు అమ్మకాలు నమోదైనట్లు టెక్నాలజీ మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్‌పాయింట్ తమ నెలవారీ స్మార్ట్‌ఫోన్స్ ట్రాకర్ నివేదికలో తెలిపింది.
కొత్త ఫోన్లను ప్రవేశపెట్టడం, మార్కెటింగ్, వేసవిలో అమ్మకాలు పటిష్టంగా ఉండటం, బ్రాండ్లు భారీగా డిస్కౌంట్లు ఇవ్వడం సులభతరమైన ఈఐఎంలు, మిడ్–ప్రీమియం సెగ్మెంట్లలో ప్రత్యేక ఆఫర్లు మొదలైన అంశాలు స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు పెరగడానికి దోహదపడినట్లు వివరించింది. కొనుగోలుదారుల సెంటిమెంట్ మెరుగుపడటంతో అల్ట్రా ప్రీమియం (రూ. 45,000 పైగా రేటు ఉండే ఫోన్లు) సెగ్మెంట్ వార్షికంగా 37 శాతం వృద్ధి నమోదు చేసినట్లు కౌంటర్‌పాయింట్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ ప్రాచిర్ సింగ్ తెలిపారు. దేశీ స్మార్ట్‌ఫోన్ల మార్కెట్..రెండో త్రైమాసికంలో విలువపరంగాను, సగటు విక్రయ ధరపరంగాను (ఏఎస్‌పీ) రికార్డు స్థాయి పనితీరు కనపర్చేందుకు అ్రల్టా–ప్రీమియం సెగ్మెంట్ దోహదపడినట్లు వివరించారు.
వివో టాప్..
స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలకు సంబంధించి పరిమాణంపరంగా వివో అగ్రస్థానంలో నిలవగా, విలువపరంగా శాంసంగ్, యాపిల్ అగ్రస్థానంలో ఉన్నట్లు కౌంటర్‌పాయింట్ తెలిపింది. పరిమాణం ప్రకారం వివోకి 20 శాతం, శాంసంగ్‌కి 16 శాతం, ఒప్పోకి 13 శాతం, రియల్‌మీకి 10 శాతం, షావోమీకి 8 శాతం వాటా ఉంది. హోల్‌సేల్ అమ్మకాల విలువపరంగా శాంసంగ్, యాపిల్ చెరి 23 శాతం వాటాతో పోటాపోటీగా టాప్‌లో ఉన్నాయి. వివోకి 15 శాతం, ఒప్పోకి 10 శాతం, రియల్‌మీకి 6 శాతం, వన్‌ప్లస్‌కి 4 శాతం వాటా ఉంది.