అన్ని ప్రభుత్వ బ్యాంకుల కంటే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రెట్టింపు | HDFC Bank’s m-cap doble of all Combined Psu banks m-cap | Sakshi
Sakshi News home page

అన్ని ప్రభుత్వ బ్యాంకుల కంటే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రెట్టింపు

May 25 2020 1:13 PM | Updated on May 25 2020 1:13 PM

 HDFC Bank’s m-cap doble of all Combined Psu banks m-cap - Sakshi

స్టాక్‌ ఎక్చ్సేంజీల్లో లిస్టైన మొత్తం 13 ప్రభుత్వరంగ బ్యాంకుల మార్కెట్‌ క్యాప్‌తో పోలిస్తే ప్రైవేట్‌ రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మార్కెట్‌ క్యాప్‌ రెండింతలుగా ఉంది. శుక్రవారం మార్కెట్‌ ముగింపు ఆధారంగా మార్కెట్‌ క్యాప్‌ విలువను పరిశీలిస్తే... హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.4.6లక్షల కోట్లుగా ఉంది. మరోవైపు 13 ప్రభుత్వరంగ బ్యాంకుల మొత్తం మార్కెట్‌ క్యాప్‌ను లెక్కిస్తే రూ.2.55లక్షల కోట్లుగా ఉంది. 

రానున్న రోజుల్లో ప్రైవేట్‌ రంగ బ్యాంకులు... వాటి ప్రత్యర్థి ప్రభుత్వరంగ బ్యాంకుల మార్కెట్‌ వాటాను ఆక్రమిస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే, లాక్‌డౌన్‌ తరువాత ప్రైవేటు రంగ బ్యాంకులతో పోలిస్తే పీఎస్‌యూ బ్యాంకుల లోన్‌ బుక్స్‌ మరింత వేగంగా క్షీణించే అవకాశం ఉందని వారు అంటున్నారు.

‘‘ప్రభుత్వ రంగ బ్యాంకులు నిరర్ధక ఆస్తుల పెరుగుదల భారాన్ని భరిస్తున్నాయి. ఈ రంగ బ్యాంకులు మొత్తం ఎన్‌పీఏల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా విభాగానికి ఎక్కువ ఎక్స్పోజర్ కలిగి ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చే వివిధ క్రెడిట్ గ్యారెంటీ పథకాలలో పీఎస్‌యూ బ్యాంకుల భాగస్వామ్యం ఎక్కువగా ఉంటుంది.’’ అని ఐసీఐసీఐ డైరెక్ట్‌ విశ్లేషకుడు కాజల్‌ గాంధీ పేర్కోన్నారు.

అన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల మార్కె్‌ట్‌ క్యాప్‌ భారీగా క్షీణించగా.., శుక్రవారం మార్కెట్‌ ముగింపు సమయానికి ఎస్‌బీఐ బ్యాంక్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.1.35లక్షల కోట్లుగా ఉంది.  ఇక ప్రైవేట్‌ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తరువాత రెండో స్థానంలో కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.2.2లక్షల కోట్లుగా ఉంది. 


‘‘రుణగ్రహీతలకు రుణాలు ఇచ్చే రిస్క్‌ను పరిగణనలోకి తీసుకుని పీఎస్‌యూ బ్యాంకులపై మేము ప్రతికూలంగా ఉన్నాము. కోవిడ్ -19 కారణంగా ప్రభుత్వం నుంచి ఉద్దీపన ప్రకటనలు, మారిటోరియం విధింపు తదితర అంశాలతో ప్రభుత్వరంగాల పరపతి విలువ క్షీణించింది. మరోవైపు, ఆర్‌బీఐ రివర్స్ రెపో తగ్గింపు... బ్యాంకులకు ఆదాయాన్ని పెంచే అవకాశాలను మరింత తగ్గిస్తుంది.’’ అని ఐఐఎఫ్‌ఎల్‌ రీసెర్చ్‌ విశ్లేషకుడు అభిమన్యు సోఫత్ తెలిపారు.

రానున్న రోజుల్లో ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లు క్షీణిస్తాయని ఎలారా సెక్యూరిటీస్‌ ఈక్విటీ రీసెర్చ్‌ రవి సుందర్‌ అభిప్రాయపడ్డారు. వడ్డీరేట్ల తగ్గింపుతో క్రమంగా బ్యాంకుల్లో డిపాజిట్లు క్షీణిస్తాయని,  ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు రానున్న రోజుల్లో మరింత అధ్వాన పరిస్థితులను ఎదుర్కోంటాయని రవి సుందర్‌ అన్నారు. 

ఇటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే.., ఎస్‌బీఐ బ్యాంకు ఉత్తమ ఎంపిక సుందర్‌ సలహానిస్తున్నారు. అలాగే ప్రైవేట్‌ రంగ బ్యాంకుల విభాగంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌లు రానున్న రోజుల్లో రాణిస్తాయని రవి సుందర్‌ అంచనా వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement