తెలంగాణలో హట్సన్‌ ఐస్‌క్రీమ్‌ ప్లాంట్‌

Hatsun Agro to set up ice cream plant in Telangana - Sakshi

207 కోట్ల పెట్టుబడి; 250 ఉద్యోగాలు

అక్టోబర్‌ నుంచి కార్యకలాపాలు  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: చెన్నైకి చెందిన పాలు, పాల ఉత్పత్తుల కంపెనీ హట్సన్‌ ఆగ్రో ప్రొడక్ట్స్‌... తెలంగాణలో అతిపెద్ద ఐస్‌క్రీమ్‌ తయారీ కేంద్రాన్ని నెలకొల్పనుంది. రూ.207 కోట్ల పెట్టుబడులతో సంగారెడ్డి జిల్లాలోని గోవింద్‌పూర్‌లో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా 250 మందికి ఉద్యోగాలతో పాటు, పరోక్షంగా మరో 250 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని, స్థానికంగా ఉన్న సుమారు 4 వేల మంది పాడి రైతులు ప్రయోజనం పొందుతారని కంపెనీ తెలిపింది.

ప్రస్తుతం ప్లాంట్‌ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి ప్లాంట్‌ కార్యకలాపాలు ఆరంభమవుతాయని పేర్కొంది. హట్సన్‌ సంస్థ అరుణ్‌ ఐస్‌ క్రీమ్, హట్సన్, ఆరోక్య మిల్క్, ఐబాకో ఐస్‌క్రీమ్స్, ఓయాలో, అనీవా, సంటోసా బ్రాండ్లతో పాలు, పెరుగు, ఐస్‌క్రీమ్స్, నెయ్యి, పన్నీర్‌ వంటి అన్ని రకాల పాల ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్‌ కార్యకలాపాల్లో ఉంది. మన దేశంలో విక్రయించడంతో పాటు అమెరికా, మధ్యప్రాచ్యం వంటి 38 దేశాలకు ఎగుమతులూ చేస్తోంది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top