గుడ్‌న్యూస్‌ : పొదుపు ఖాతాలపై పెరిగిన వడ్డీ రేట్లు | Govt Hikes Interest On Small Savings Scheme | Sakshi
Sakshi News home page

గుడ్‌న్యూస్‌ : పొదుపు ఖాతాలపై పెరిగిన వడ్డీ రేట్లు

Sep 20 2018 2:22 PM | Updated on Sep 20 2018 3:01 PM

Govt Hikes Interest On Small Savings Scheme - Sakshi

చిన్నమొత్తాల పొదుపు ఖాతాలపై పెరిగిన వడ్డీ రేట్లు

సాక్షి, న్యూఢిల్లీ : చిన్నతరహా పొదుపు ఖాతాల్లో మదుపు చేసే వారికి కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. జాతీయ పొదుపు సర్టిఫికెట్‌, పీపీఎఫ్‌ వంటి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికానికి 0.4 శాతం మేర పెంచింది. బ్యాంకుల్లో డిపాజిట్లపై పెరిగిన వడ్డీరేట్లకు అనుగుణంగా పొదుపు ఖాతాలపై వడ్డీరేట్లను సర్కార్‌ సవరించింది. చిన్నతరహా పొదుపు పథకాలపై వడ్డీరేట్లను ప్రతి త్రైమాసికంలో నోటిఫై చేస్తారు.

2018-19 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను సవరించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. వడ్డీ రేట్ల సవరణతో అయిదేళ్ల కాలపరిమితి డిపాజిట్‌పై వడ్డీరేటును 7.8 శాతానికి, సీనియర్‌ సిటిజెన్‌ పొదుపు పథకంపై వడ్డీరేటును 8.7 శాతానికి, రికరింగ్‌ డిపాజిట్‌పై వడ్డీ రేటు 7.3 శాతానికి పెరిగాయి. 4 శాతంగా ఉన్న సేవింగ్‌ డిపాజిట్లపై వడ్డీరేటును యథాతథంగా ఉంచారు.

ఇక ప్రస్తుతం పీపీఎఫ్‌, ఎన్‌ఎస్‌సీపై 7.6 శాతం ఉన్న వడ్డీరేటు 8 శాతానికి పెరిగింది. సుకన్య సమృద్ధి ఖాతాలపై 0.4 శాతం వడ్డీరేటు అధికమై 8.5కు చేరింది. ఒకటి నుంచి మూడేళ్ల కాలపరిమితి డిపాజిట్లపై వడ్డీ రేటును 0.3 శాతం పెంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement