ఆర్‌బీఐ సొమ్ము కోరలేదు..

Government Says Not Seeking Funds From RBI Reserves - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆర్‌బీఐ మిగులు నిల్వల నుంచి రూ 3.6 లక్షల కోట్లు బదిలీ చేయాలని ప్రభుత్వం కోరుతోందన్న వార్తలను కేంద్రం శుక్రవారం తోసిపుచ్చింది. ఆర్‌బీఐ నిల్వల నుంచి సొమ్మును తమకు బదలాయించాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని సాగుతున్న ప్రచారం నిరాధారమని, ఇవి కేవలం ఊహాగానాలేనని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ స్పష్టం చేశారు.

ప్రభుత్వ ద్రవ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, ఆర్‌బీఐ నిల్వలను బదిలిచేయాలన్న వార్తలు నిరాధారమైనవని పేర్కొన్నారు. ఆర్‌బీఐ కోసం తగిన ఆర్థిక మూలధన కార్యాచరణ కసరత్తు కేవలం ప్రతిపాదన దశలో ఉందని తెలిపారు. ప్రభుత్వం ద్రవ్య లోటును 5.1 శాతం నుంచి విజయవంతంగా నియంత్రిస్తూ వస్తోందన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును 3.3 శాతానికి తగ్గిస్తామన్నారు.

కాగా ఆర్‌బీఐ వద్దనున్న రూ 9.59 లక్షల కోట్ల నుంచి రూ 3.6 లక్షల కోట్లను బదలాయించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదనే ఆర్‌బీఐ-కేంద్ర ప్రభుత్వం మధ్య ప్రతిష్టంభనకు కేంద్రబిందువని ఓ వర్గం మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తల నేపథ్యంలో ప్రభుత్వం వ్యవస్ధలను వ్యూహాత్మకంగా నిర్వీర్యం చేస్తోందని కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంపై విమర్శలతో విరుచకుపడింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top