గూగుల్‌ మ్యాప్స్‌ పుట్టిన రోజు : కొత్త అప్‌డేట్స్‌

Google Maps Gets New Logo Redesign And Updates On 15th Birthday - Sakshi

15 ఏళ్ల మైలురాయికి గూగుల్‌ మ్యాప్స్‌

కొత్త లోగో,  5  కొత్త ఫీచర్స్‌

ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ దిగ్గజం గూగుల్‌ తన యాప్‌లలో ప్రధాన యాప్‌ గూగుల్‌ మ్యాప్‌ను కొత్త లోగో, కొత్త ఫీచర్లతో అప్‌డేట్‌ చేసింది.  గూగుల్‌ మ్యాప్‌ 15 వ పుట్టిన రోజు సందర్భంగా  గురువారం నుంచి ఈ  కీలక మార్పులు చేసింది. గూగుల్ మ్యాప్స్  15 ఏళ్లు మైలురాయిని  అధిగమించిన సందర్భంగా  కలర్‌ఫుల్‌ కొత్త లోగోను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా యూజర్ల సౌలభ్యం కోసం తాజాగా  అయిదు కొత్త సదుపాయాలను పరిచయం చేసింది. యాప్‌ అడుగుభాగంలో  ఎక్స్‌ప్లోర్‌, కమ్యూట్‌, సేవ్డ్‌, కంట్రిబ్యూట్‌, అప్‌డేట్స్‌ (అన్వేషించండి, ప్రయాణించండి, సేవ్ చేయండి, సహకరించండి, నవీకరణ) అనే ఐదు ట్యాబ్స్ ను కొత్తగా  జోడించింది. దీంతో ఇప్పటివరకు గూగుల్ మ్యాప్స్ లో అంతర్గతంగా ఉన్న సదుపాయాలన్నీ ఈ ఐదు ట్యాబ్స్‌లో ఇక మీదట సులభంగా అందుబాటులోకి వస్తాయన్నమాట.

అన్వేషించండి: సమీప రెస్టారెంట్లు, ముఖ్య ప్రదేశాలు, సమీక్షలు , అలాగే సమీక్షలను వ్రాయడానికి, ఫోటోలను అప్‌లోడ్ చేయడానికి, ఇతర సిఫార్సులను  అనుమతినిస్తుంది. 
కమ్యూట్‌ : ఒక ప్రదేశానికి దిశలను ఇస్తుంది, ప్రయాణ సమయ అంచనాలు, ట్రాఫిక్ హెచ్చరికలను అందిస్తుంది ఎప్పటిలాగానే.
సేవ్డ్‌ :   సులభంగా సెర్చ్‌ చేసేందుకు వీలుగా ఇప్పటివరకు  వినియోగదారులు సేవ్ చేసిన  హోం, ఆఫీస్‌, నచ్చిన రెస్టారెంట్లు, తదితర వివరాలు ఒకేచోట కనిపిస్తాయి. అలాగే గతంలో  ఎక్కడెక్కడ తిరిగారో అన్ని వివరాలు చూపించే టైం లైన్‌ ఆప్షన్ కూడా దీంట్లోనే కనిపిస్తుంది. వద్దు అనుకుంటే లొకేషన్ హిస్టరీ డిజేబుల్ చేసుకోవచ్చు.
కంట్రిబ్యూట్‌:   ఎప్పటికప్పుడు వెళ్లే ప్రదేశాలకు సంబంధించిన ఫోటోలు, ఆయా రెస్టారెంట్లు ఇతర స్థలాల గురించి రివ్యూలను ప్రపంచంతో షేర్ చేసుకునే అవకాశం. అలాగే ఇప్పటికే ఉన్న ప్రదేశాలకు సంబంధించి ఏమైనా కరెక్షన్స్ ఉంటే వాటిని కూడా సూచించవచ్చు. 


అప్‌డేట్స్‌ :  ప్రస్తుతం మీరు ఉన్న ప్రదేశానికి దగ్గరలో ఉన్న అన్ని ప్రదేశాలకు సంబంధించిన రికమండేషన్లు, స్థానిక నిపుణులు, వివిధ వ్యాపార సంస్థల  మెసేజ్‌ల వివరాలు ఇక్కడ కనిపిస్తాయి..అలాగే బస్సు లేదా ట్రైన్ ప్రయాణం గురించి ప్రయాణం ముగిసిన వెంటనే మరింత సమాచారం ఇచ్చే విధంగా గూగుల్ మ్యాప్స్ యూజర్లను ఇక మీదట ప్రోత్సహిస్తుంది. అలాగే ఆ సమాచారాన్ని  వినియోగదారులందరికీ అందుబాటులో ఉంచుతుంది.  మీరు ఈ టాబ్ ద్వారా నేరుగా మ్యాప్స్‌లోని ఇతర వ్యాపారాలతో కూడా సంభాషించవచ్చు. వివిధ ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు ఇక మీదట అక్కడ ఉండే ఉష్ణోగ్రతలు, వీల్ ఛెయిర్ వంటి సదుపాయాలు లాంటి వివరాలు లభ్యం. ఇక చివరగా నిర్దిష్ట ప్రాంతాల్లో, మహిళల కోసం కొత్త భద్రతా సమాచారం కూడా ఉంది. ఇందులో  సురక్షితమైన రవాణా మార్గాల గురించి సమాచారాన్ని అందిస్తుంది. అక్కడ ఉండే సెక్యూరిటీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు వంటి వివరాలను కూడా గూగుల్ మ్యాప్స్ మనకు తెలియజేస్తుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top