స్థిరంగా ముగిసిన బంగారం

Gold prices slump to Rs 48863 per 10 gm - Sakshi

వారం మొత్తం మీద రూ.1300 లాభం

రూ.49,348 వద్ద కొత్త ఆల్‌టైం హై

అంతర్జాతీయంగా 1800డాలర్లపైన ముగింపు

మల్టీ కమోడిటీ ఎక్చ్సేంజ్‌లో బంగారం ధర శుక్రవారం స్థిరంగా ముగిసింది. అయితే రూ.49000 స్థాయిని కోల్పోవడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్లో బంగారంలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం, డాలర్‌ మారకంలో రూపాయి అస్థిరత తదితర అంశాలు బంగారం అమ్మకాలపై ఒత్తిడిని పెంచాయి. ఫలితంగా ఎంసీఎక్స్‌లో రాత్రి 10గ్రాముల బంగారం ధర రూ.15ల స్వల్ప నష్టంతో రూ.48863 వద్ద స్థిరపడింది.   ఇదే వారంలో గురువారం ఎంసీఎక్స్‌లో బంగారం ధర రూ.49,348 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే రికార్డు స్థాయిలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో రూ.485 క్షీణతను చవిచూసింది. వారం మొత్తం మీద రూ.1302లు లాభపడింది. ఈ ఏడాది ప్రథమార్థంలో బంగారం ధర 25శాతం ర్యాలీ చేసింది.  

‘‘అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 9ఏళ్ల గరిష్టాన్ని తాకిన తదుపరి ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకున్నారు. కరోనా వైరస్‌ కేసుల పెరుగుదల, భౌగోళిక ఉద్రిక్తతలతో ఇన్వెస్టర్లు రక్షణాత్మక సాధనమైన బంగారం కొనుగోళ్లకు మొగ్గుచూపవచ్చు. కాబట్టి ధీర్ఘకాలిక దృష్ట్యా బంగారంలో పెట్టుబడులు మంచిదే.’’ అని కోటక్‌ సెక్యూరిటీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రవీంద్రరావ్‌ తెలిపారు. 
 
అంతర్జాతీయంగా 1800డాలర్లపైన ముగింపు:

అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర నష్టాలతో ముగిసింది. అయితే 1800 డాలర్ల స్థాయిని నిలుపుకోవడం విశేషం. బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీతో శుక్రవారం యూఎస్‌ స్టాక్‌ మార్కెట్‌ లాభంతో ముగిసింది. ఫలితంగా దీనికితోడు బంగారం ధరలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో అమెరికాలో రాత్రి ఔన్స్‌ బంగారం ధర 2డాలర్లు నష్టాన్ని చవిచూసి 1,802 డాలర్ల వద్ద స్థిరపడింది. 

ఇక అంతర్జాతీయ మార్కెట్లో వారం మొత్తం మీద 14.4డాలర్లు లాభపడింది. అమెరికాలో పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి మరింత పెరగడంతో పాటు అనేక రేటింగ్‌, బ్రోకరేజ్‌ సంస్థ అంతర్జాతీయ వృద్ధిపై నెగిటివ్‌ అవుట్‌లుక్‌ను కేటాయించడంతో బంగారానికి డిమాండ్‌ పెరిగింది. అలాగే ఈ ఏడాది ప్రథమార్థంలో బంగారం ధర 18శాతం ర్యాలీ చేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top