ఇది ఉంటే మీ ఫోన్‌ కిందపడ్డా పగలదు!

Genius Student Invents Mobile Airbag - Sakshi

అర చేతిలో స్మార్ట్‌ ఫోన్‌.. అందరి జేబుల్లో సాధారణమైపోయింది. ఒకప్పటి బండ ఫోన్లలా.. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను కాపాడుకోలేకపోతున్నాం. దాని రక్షణ కోసం స్క్రిన్‌ గార్డ్‌, ప్యానెల్‌లు అని మార్కెట్లోకి ఎన్ని పుట్టుకొచ్చినా అవి మన ఫోన్లను రక్షించలేక పోతున్నాయి. గట్టిగా కిందపడ్డా.. కోపంగా.. చిరాకులో బండకు కొట్టినా 16 ముక్కలై.. పనికి రాకుండా పోతుంది. ఇలానే జర్మనీలోని ఆలేన్ విశ్వవిద్యాలయం విద్యార్థి ఫిలిప్‌ ఫ్రెంజెల్‌కు తన ఐఫోన్‌ పలుమార్లు కింద పడి పగిలిపోవడం చిరాకెత్తించింది. వెంటనే దీనికి ఓ మార్గాన్ని కనిపెట్టాలని ఆ కుర్రాడు తీవ్ర ప్రయత్నాలు చేశాడు. చివరకు మొబైల్‌ ఎయిర్‌ బ్యాగ్‌ కనుగొన్నాడు. అవును.. మొబైల్‌ ఎయిర్‌ బ్యాగ్‌.. కార్లకు ప్రమాదం సంభవించినప్పుడు మనష్యులను రక్షించే ఎయిర్‌ బ్యాగ్‌లానే.. ఈ ఎయిర్‌ బ్యాగ్‌ మొబైల్‌ పగిలిపోకుండా రక్షిస్తోంది. దీనికి ఆడ్‌కేస్‌ (ADCASE) అని ఓ పేరు కూడా పెట్టాడు. ఈ ప్రయోగానికి అతను అవార్డు కూడా గెలుచుకున్నాడు. జర్మనీలో విద్యార్థుల ప్రాజెక్టులకు అవార్డులు ప్రకటించే జర్మన్‌ సోసైటీ ఫర్‌ మెకాట్రోనిక్సే ఫ్రెంజల్‌కు ఆ అవార్డు అందజేసింది.

మొబైల్‌ ప్యానెల్‌గా ఉపయోగించుకునేలా ప్రత్యేకంగా తయారు చేసిన ఓ డివైజ్‌కు సెన్సార్లను అమర్చి దానికి ఓ ఎయిర్‌ బ్యాగ్‌ అమర్చాడు. మొబైల్‌ ఆకస్మాత్తుగా కిందపడినప్పుడు ఆ డివైజ్‌లోని సెన్సార్లు యాక్టివేట్‌ అయి ఎయిర్‌ బ్యాగ్‌ తెరుచుకుంటుంది. ఇది మొబైల్‌, స్క్రీన్‌లను నేలకు తగలకుండా కాపాడుతుంది. ఈ డివైజ్‌ తయారు చేయడానికి ఫ్రెంజల్‌ అతని స్నేహితులు గత రెండున్నరేళ్లుగా కష్టపడ్డారు. అన్ని రకాల ఐఫోన్‌లకు దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చే యోచనలో ఉన్నారు. ప్రస్తుతం నిధుల సేకరణ జరుగుతోంది. జూలైలో అందుబాటులోకి తీసుకురావాలని ఫిలిప్ బృందం భావిస్తోంది.

మొబైల్‌ ఎయిర్‌ బ్యాగ్‌తో ఫిలిప్‌ ఫ్రెంజెల్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top