
డెట్రాయిట్: పర్యావరణ పరిరక్షణ నిబంధనల ఉల్లంఘనకి సంబంధించిన కేసులో ఫోక్స్‌వ్యాగన్ జనరల్ మేనేజర్ ఆలివర్ ష్మిట్‌కి అమెరికా కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష, 4 లక్షల డాలర్ల జరిమానా విధించింది. అమెరికాను మోసగించేందుకు ఉద్దేశించిన కుట్రలో ఆలివర్ కీలక పాత్ర పోషించారని డెట్రాయిట్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి షాన్ కాక్స్ వ్యాఖ్యానించారు. ఫోక్స్‌వ్యాగన్‌లో ఉన్నత స్థానానికి చేరడానికి దీన్ని అవకాశంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించారని ఆక్షేపించారు.
కాలుష్యకారక వాయువుల ప్రమాణాల పరీక్షలను గట్టెక్కడానికి ఫోక్స్‌వ్యాగన్ తమ కార్లలో రహస్య సెన్సార్లను అమర్చేదని అభియోగాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఆలివర్‌కి 169 ఏళ్ల దాకా జైలు శిక్షకు అవకాశం ఉంది. అయితే, తప్పులను అంగీకరించిన దరిమిలా శిక్షాకాలాన్ని న్యాయస్థానం తగ్గించింది.