ఐదేళ్లలో రూ.102 లక్షల కోట్లు

FM Says Rs 102 Lakh Crore National Infrastructure Pipeline - Sakshi

మౌలిక ప్రాజెక్టుల అమలు ప్రణాళిక ఇది...

5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌

న్యూఢిల్లీ: మౌలిక రంగంలో వచ్చే ఐదేళ్లలో రూ.102 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రాజెక్టులను ‘నేషనల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పైప్‌లైన్‌’లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇందులో ముంబై–అహ్మదాబాద్‌ హైస్పీడ్‌ రైలు ప్రాజెక్టు కూడా ఉండడం గమనార్హం. ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో రానున్న ఐదేళ్లలో మౌలిక రంగంలో రూ.100 లక్షల కోట్లను ఇన్వెస్ట్‌ చేయనున్నట్టు ప్రకటించిన విషయాన్ని కేంద్ర ఆరి్థక మంత్రి నిర్మలా సీతారామన్‌ గుర్తు చేశారు. మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. ప్రభుత్వం నియమించిన టాస్క్‌ఫోర్స్‌ కేవలం నాలుగు నెలల్లోనే 70 భాగస్వాములతో సంప్రదింపులు నిర్వహించి రూ.102 లక్షల కోట్ల ప్రాజెక్టులను విద్యుత్, రైల్వేస్, అర్బన్‌ ఇరిగేషన్, మొబిలిటీ, విద్య, ఆరోగ్య రంగాల్లో గుర్తించినట్టు చెప్పారు.

మరో రూ.3లక్షల కోట్ల ప్రాజెక్టులు కూడా వీటికి తోడవుతాయన్నారు. గత ఆరేళ్లలో కేంద్రం, రాష్ట్రాలు మౌలిక రంగంపై చేసిన రూ.51 లక్షల కోట్లకు ఇది అదనమని పేర్కొన్నారు. ప్రభుత్వం గుర్తించిన ప్రాజెక్టుల్లో కేంద్రం, రాష్ట్రాల నుంచి చెరో 39 శాతం, ప్రైవేటు రంగం నుంచి 22 శాతం ఉంటాయన్నారు. ఇంధన రంగంలో రూ.25 లక్షల కోట్ల ప్రాజెక్టులు రానున్నాయని, రోడ్ల నిర్మాణంలో రూ.20 లక్షల కోట్లు, రూ.14 లక్షల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు రానున్నట్టు మంత్రి నిర్మలా సీతారామన్‌ వివరించారు. 2025 నాటికి 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా (దాదాపు రూ.356 లక్షల కోట్లు) అవతరించేందుకు ఈ ప్రాజెక్టులు తోడ్పడతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.  

ఇంధన, రోడ్లు, రైల్వేకు పెద్దపీట
కేంద్రం గుర్తించిన ప్రాజెక్టుల్లో ఇంధనం, రోడ్లు, రైల్వే రంగాలకు అగ్ర ప్రాధాన్యం లభించింది.  ‘‘జాతీయ మౌలిక సదుపాయాల పైపులైన్‌ (ఎన్‌ఐపీ) కింద గుర్తించిన రూ.102 లక్షల కోట్ల ప్రాజెక్టుల్లో రూ.42.7 లక్షల కోట్ల ప్రాజెక్టులు అమలు దశలో ఉన్నాయి. రూ.32.7 లక్షల కోట్ల ప్రాజెక్టులు తయారీ దశలో, 19.1 లక్షల కోట్లు అభివృద్ధి దశలో ఉన్నాయి. ఇవి 22 శాఖలు, 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో అమలవుతాయి’’ అని మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. కేంద్రం, రాష్ట్రాలు, ప్రైవేటు రంగం సమన్వయంతో ఎన్‌ఐపీ ఉంటుందన్నారు. ఈ ప్రాజెక్టులతో ఉపాధి కల్పన, జీవన సౌఖ్యం కలగడంతోపాటు, మౌలిక సదుపాయాలు అందరికీ సమానంగా అందుబాటులోకి రావడం వల్ల సమగ్ర వృద్ధికి వీలు పడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. తొలి విడత వార్షిక అంతర్జాతీయ ఇన్వెస్టర్ల సమావేశం వచ్చే ఏడాది ద్వితీయ భాగంలో ఉంటుందని తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top