‘మౌలికం’ కీలకం

Union Budget 2020: Highways development to be accelerated - Sakshi

రవాణా రంగంలో మౌలిక సదుపాయాలు, హైవేల అభివృద్ధికి రూ.1.70 లక్షల కోట్లు

పురోగతిలో 6,500 ప్రాజెక్టులు

పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు మరిన్ని తేజాస్‌ రైళ్లు

‘ఉడాన్‌’ ద్వారా 2024 నాటికి వంద ఎయిర్‌పోర్టుల అభివృద్ధి

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక అభివృద్ధికి చోదకశక్తి లాంటి మౌలిక వసతుల రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఇప్పటికే రూ.103 లక్షల కోట్లతో పలు ప్రాజెక్టులను ప్రారంభించిందని, తాజాగా రవాణా రంగంలో మౌలిక వసతులు, హైవేలను అభివృద్ధి చేసేందుకు బడ్జెట్‌లో రూ.1.70 లక్షల కోట్లను ప్రతిపాదిస్తున్నట్లు కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. దేశవ్యాప్తంగా పౌరుల జీవనాన్ని సులభతరం చేసేందుకు 6,500 మౌలిక వసతుల ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నట్లు చెప్పారు. మౌలిక వసతుల రంగంలో ఐదేళ్లలో రూ.100 లక్షల కోట్లకుపైగా వెచ్చిస్తామని ప్రధాని గతేడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో చెప్పారని గుర్తు చేశారు. జాతీయ మౌలిక వసతుల పైప్‌లైన్‌ (ఎన్‌ఐపీ) కోసం ఇప్పటికే రూ.20 వేల కోట్లు కేటాయించామన్నారు.

2023కి ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్‌ వే    
నిర్మాణం, నిర్వహణ రంగాల్లో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆర్థిక మంత్రి చెప్పారు. త్వరలోనే జాతీయ సరుకు రవాణా విధానాన్ని ప్రకటిస్తామని తెలిపారు. 2023 నాటికి ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్‌ వేతోపాటు మరో రెండు ప్యాకేజీలు పూర్తవుతాయన్నారు. చెన్నై–బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ రహదారి పనులు కూడా ప్రారంభిస్తామన్నారు. 27,000 కి.మీ మేర విద్యుదీకరణను పూర్తి చేసే దిశగా రైల్వేలు కృష్టి చేస్తున్నాయని చెప్పారు. ‘రహదారుల నిర్మాణంలో వేగం గణనీయంగా పెరిగింది. 2015–16లో రోజుకు 17 కి.మీ మాత్రమే రోడ్ల నిర్మాణం జరగగా 2018–19 నాటికి ఇది 29.7 కి.మీ.కి పెరిగింది’అని ఆర్థిక మంత్రి తెలిపారు. బడ్జెట్‌లో మౌలిక వసతులకు పెద్దపీట వేయడంతో గృహ నిర్మాణం, చౌకగా పరిశుద్ధమైన ఇంధనం, ఆరోగ్యం, విద్యా సంస్థలు, రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, బస్‌ టెర్మినళ్లు, మెట్రో, రైల్వే రవాణా, గిడ్డంగులు, సాగునీటి ప్రాజెక్టులు తదితర రంగాల్లో ఉపాధి అవకాశాలు విస్తృతం కానున్నాయి.  

ఉపాధి అవకాశాలు విస్తృతం: గడ్కారీ
మౌలిక వసతుల రంగానికి ఈ బడ్జెట్‌ గట్టి ఊతం ఇచ్చిందని కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కారీ పేర్కొన్నారు. తాజా బడ్జెట్‌ పారిశ్రామిక అభివృద్ధికి జవసత్వాలు కల్పించి ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని, తద్వారా 2 కోట్లకుపైగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉందన్నారు.  

బడ్జెట్‌లో ‘మౌలిక’వరాలు...
► పర్యాటక ప్రాంతాలను అనుసంధానించేలా మరిన్ని తేజాస్‌ రైళ్లు.
► ముంబై–అహ్మదాబాద్‌ హైస్పీడ్‌ రైళ్లపై చురుగ్గా పరిశీలన.  
► ‘ఉడాన్‌’పథకం ద్వారా 2024 నాటికి మరో వంద విమానాశ్రయాల అభివృద్ధి.  
► ఇంధనం, పునరుత్పాదక వనరులకు బడ్జెట్‌లో రూ.22,000 కోట్లు  
► 9,000 కి.మీ మేర ఆర్థిక కారిడార్‌   
► 2,000 కి.మీ మేర తీర ప్రాంత రహదారులు, హైవేల అభివృద్ధి.  

రైల్వే లైన్ల పక్కన  సోలార్‌ ప్రాజెక్టులు
రైల్వే నెట్‌వర్క్‌ కోసం సౌర విద్యుత్‌ను వినియోగించుకునేలా ట్రాక్‌ల పక్కన రైల్వేకు చెందిన భూమిలో పెద్ద ఎత్తున సోలార్‌ పవర్‌ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. పీపీపీ విధానంలో 150 ప్యాసింజర్‌ రైళ్ల ఏర్పాటు, 4 స్టేషన్ల పునరాభివృద్ధి పనులు చేపట్టనున్నారు. రూ. 18,600 కోట్లు ఖర్చయ్యే 148 కి.మీల బెంగళూరు సబర్బన్‌ రవాణా ప్రాజెక్టును బడ్జెట్‌లో ప్రతిపాదించారు. మెట్రో తరహాలో టికెట్‌ రేట్లు ఉంటాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top