పెద్ద టెల్కోలు 5 చాలు! | Sakshi
Sakshi News home page

పెద్ద టెల్కోలు 5 చాలు!

Published Mon, Feb 27 2017 1:55 AM

పెద్ద టెల్కోలు 5 చాలు! - Sakshi

ప్రస్తుత స్థిరీకరణ మంచిదే: టెలికం కార్యదర్శి
బార్సిలోనా: భారత్‌ టెలికం మార్కెట్లో అయిదు పెద్ద టెలికం కంపెనీలు ఉంటే సరిపోతుందని టెలికం శాఖ కార్యదర్శి జేఎస్‌ దీపక్‌ వ్యాఖ్యానించారు. తాజాగా ఈ రంగంలో జరుగుతున్న స్థిరీకరణ(కంపెనీల కొనుగోళ్లు, విలీనాలు)తో బరిలో అయిదు ప్రధాన కంపెనీలు మిగిలే అవకాశం ఉందన్నారు. తగినంత పోటీకి ఇవి సరిపోతాయని... దీనివల్ల స్పెక్ట్రం కూడా చిన్నచిన్నభాగాలుగా అయిపోకుండా ఉంటుందని దీపక్‌ పేర్కొన్నారు. మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌లో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రిలయన్స్‌ జియో అందిస్తున్న ఉచిత వాయిస్‌ కాలింగ్‌ ఇతరత్రా ఆఫర్ల దెబ్బకు ఇతర టెల్కోలు సైతం టారిఫ్‌లను భారీగా తగ్గించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో చిన్న కంపెనీలు పెద్ద సంస్థల గూటికి చేరుతున్నాయి.

వొడాఫోన్‌.. ఐడియాలో విలీనం అయ్యేందుకు సిద్ధం కాగా, టెలినార్‌ ఇండియాను ఎయిర్‌టెల్‌ కొనుగోలు చేస్తున్నట్లు తాజాగా ప్రకటించడం తెలిసిందే. అనిల్‌ అంబానీ ఆర్‌కామ్‌ కూడా ఎయిర్‌సెల్‌తో విలీనానికి ఒప్పందం కుదుర్చుకుంది. ‘టెల్కోల ఆదాయం పడిపోతుండటం ఆందోళకరమైన అంశమే. అయితే, ఈ పరిస్థితి త్వరలో మారుతుంది. తాజాగా భారత్‌ టెలికం రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో ఇక్కడ పెట్టుబడులు పెట్టడం కంపెనీలకు లాభదాయకమే. టెలికం రంగంలో ప్రస్తుత స్థిరీకరణ పరిశ్రమకు మంచిదే. దీనివల్ల ప్రైవేటు రంగంలో నాలుగు, ప్రభుత్వ రంగంలో ఒక్కటి చొప్పున పెద్ద కంపెనీలు మిగులుతాయి. మన మార్కెట్‌కు ఇవి సరిపోతాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు.

 
Advertisement
 
Advertisement