తప్పుడు అధికారుల వివరాలివ్వండి

తప్పుడు అధికారుల వివరాలివ్వండి - Sakshi


బ్యాంకింగ్‌కు ఆర్థికశాఖ ఆదేశం

డీమోనిటైజేషన్‌ కాలంలోఅవకతవకలపై దృష్టి  




న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు, బ్యాంకింగ్‌లో వాటి డిపాజిట్‌లకు (డీమోనిటైజేషన్‌) సంబంధించి 50 రోజుల కాలంలో (నవంబర్‌ 8 నుంచి డిసెంబర్‌ 31) అవకతవకలకు పాల్పడిన అధికారులపై ఆర్థికమంత్రిత్వశాఖ ఇక దృష్టి సారిస్తోంది. ఆయా అధికారుల వివరాలు అందించాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. తప్పుచేసిన వారిని ఎవ్వరినీ ఉపేక్షించేదిలేదని ప్రధాని నరేంద్రమోదీ కొత్త సంవత్సరం ప్రారంభం సందర్భంగా ఇచ్చిన సందేశంలో ప్రకటించిన నేపథ్యంలో ఆర్థికశాఖ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ‘‘ డీమోనిటైజేషన్‌ కాలంలో అవకతవకలకు పాల్పడిన అధికారుల వివరాలు అన్నింటినీ బ్యాంకులు ఆర్థికశాఖకు అందిస్తాయి’’ అని ఆర్థికశాఖలో అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి.  



డైరెక్టర్లపైనా విజిలెన్స్‌ ప్రొసీడింగ్స్‌.. : అవకతవకలకు పాల్పడ్డ బ్యాంక్‌ డైరెక్టర్ల మీద ఆర్థికశాఖ విజిలెన్స్‌ ప్రొసీడింగ్స్‌ కొనసాగిస్తుందని, ఇక అధికారుల స్థాయిలో ఆయా బ్యాంకులు సైతం శాఖపరమైన విచారణ, లేక నేరపూరిత చట్టాల కింద చర్యలు తీసుకుంటుందని ఆర్థికశాఖ వర్గాలు వెల్లడించాయి. డీమోనిటైజేషన్‌ సమయంలో కొందరు అధికారులు వ్యవస్థ నిర్వీర్యం చేసే విధానాలకు ప్రయత్నించారని ఆర్థికమంత్రిత్వశాఖ వర్గాలు పేర్కొన్నాయి. కోల్‌కతాలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా అధికారులపై సీబీఐ కేసులను సైతం నమోదుచేసిన సంగతి తెలిసిందే.


ఎస్‌బీఐ, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బికనీర్‌ అండ్‌ జైపూర్, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ మైసూర్‌ తదితర బ్యాంక్‌ అధికారులపైనా విచారణ సంస్థ ఎఫ్‌ఐఆర్‌ను నమోదుచేసింది. యాక్సిస్‌ బ్యాంక్‌సహా కొన్ని ప్రైవేటు రంగ బ్యాంకుల్లో సైతం అవకతవకలు జరిగిన విషయం వెలుగుచూసింది. మరోవైపు బ్యాంకుల్లో ఆర్‌బీఐ కూడా భారీగా తనిఖీలు జరిపే అవకాశం ఉందని అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. డీమోనిటైజేషన్‌ సమయంలో కొన్ని బ్యాంకుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ పలు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top