లిక్విడిటీ సమస్య లేదు

Finance Minister Nirmala Sitharaman At A Meeting With Private Bankers - Sakshi

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

ఆర్థిక రంగ వృద్ధి పుంజుకుంటుందని ప్రకటన

న్యూఢిల్లీ: బ్యాంకులు రుణ వితరణ కార్యకలాపాలను పెంచాయని, వినియోగం పెరుగుతోందని, దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ భాగం (2019 అక్టోబర్‌ నుంచి 2020 మార్చి వరకు) నుంచి ఆర్థిక రంగ వృద్ధి పుంజుకుంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వివరించారు. గురువారం ఢిల్లీలో ప్రైవేటు బ్యాంకులు, ఫైనాన్షియల్‌ ఇనిస్టిట్యూషన్ల అధినేతలతో భేటీ అయిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ... అవి ఎటువంటి ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) సమస్యలను ఎదుర్కోవడం లేదని ప్రకటించారు. రుణాలకు తగినంత డిమాండ్‌ ఉందని అవి చెప్పినట్టు పేర్కొన్నారు. ఇది మంచి శక్తినిచ్చే టానిక్‌వంటి సమావేశమని, మంచి విషయాలను, సానుకూల అంశాలను విన్నట్టు మంత్రి చెప్పారు. ఆర్థిక రంగ వృద్ధి క్షీణత బోటమ్‌ అవుట్‌ (ఈ స్థాయి నుంచి పడిపోకపోవడం) చేరుకుందన్నారు.

రానున్న పండుగల సీజన్‌ ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి ఆరేళ్ల కనిష్ట స్థాయికి చేరి 5 శాతానికి పడిపోవడం గమనార్హం. వాహన అమ్మకాలు పడిపోవడం అన్నది సైక్లికల్‌గా జరిగిందేనని, వచ్చే ఒకటి రెండు త్రైమాసికాల్లో మెరుగుపడుతుందని బ్యాంకులు చెప్పినట్టుగా మంత్రి వెల్లడించారు. మీడియా సమావేశంలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక శాఖా కార్యదర్శి రాజీవ్‌కుమార్‌ మాట్లాడుతూ... పండుగల సమయంలో రుణాలను అందించేందుకు దేశవ్యాప్తంగా 400 జిల్లాల్లో బ్యాంకులు మేళాలు నిర్వహిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రైవేటు బ్యాంకులను కూడా ఆహ్వానించినట్టు చెప్పారు. ప్రముఖ బ్యాంకర్‌ ఉదయ్‌కోటక్‌ మాట్లాడుతూ... అక్టోబర్‌ నుంచి అధిక శాతం బ్యాంకులు ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ ఆధారిత లెండింగ్‌ రేట్లను అనుసరించనున్నట్టు ప్రకటించారు. కార్పొరేట్‌ పన్ను తగ్గింపుతో ప్రైవేటు పెట్టుబడులు పుంజుకుంటాయన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top