రూపాయి పతనంతో ‘ఎలక్ట్రిక్‌’ షాక్‌

Electric vehicles that are expensive - Sakshi

ప్రియం కానున్న ఎలక్ట్రిక్‌ వాహనాలు 

బ్యాటరీల దిగుమతులే కారణం 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: రోజురోజుకూ భారత్‌లో వాహన కాలుష్యం పెరుగుతోంది. పెట్రోలు ధరలు దూసుకెళ్తున్నాయి. ఎలక్ట్రిక్‌ వాహనాలే ఇందుకు పరిష్కారం అన్న చర్చ ఊపందుకున్న తరుణంలో రూపాయి విలువ పడిపోయి పరిశ్రమకు కొత్త సవాళ్లను విసిరింది. అసలే వాహనాల ధర తగ్గించే దిశగా కంపెనీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. డాలరు బలపడటంతో మోటారు, బ్యాటరీలు మరిం త ప్రియం కానున్నాయి. ఇటీవలే ధరలను పెంచిన కంపెనీలు మరోసారి ధరల సవరణకు కసరత్తు చేస్తున్నాయి. అయితే ఈ–వెహికల్స్‌ ధర సంప్రదాయ వాహనాలతో పోలిస్తే కాస్త ఖరీదు. ఇందుకు వీటిలో వాడే బ్యాటరీ, మోటార్లే కారణం. పూర్తిగా విదేశాల నుంచే ఇవి దిగుమతి అవుతున్నాయి.  

ఆ రెండు విడిభాగాలే..: మోటారు, బ్యాటరీయే ఎలక్రిక్‌ వాహనాల తయారీలో అత్యంత కీలకం. వాహనానికి అయ్యే ఖర్చులో 70% విలువ వీటిదే. డాలరుతో రూపాయి మారకం విలువ ఇటీవలే రూ.69.10 దాకా పడింది. బుధవారం ఇది 68.69 గా నమోదైంది. రూపాయి విలువ పడిపోతే దిగుమతులు భారం అవుతాయి. ఈ పరిస్థితుల్లో ఎలక్ట్రిక్‌ వాహనాల ధర ఎంతకాదన్నా 10% వరకు అధికం అవుతుందని ఎలక్ట్రిక్‌ టూ–వీలర్ల తయారీలో ఉన్న ఆవెర న్యూ అండ్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ మోటో కార్ప్‌ టెక్‌ ఫౌండర్‌ ఆకుల వెంకట రమణ సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. కస్టమ్స్‌ డ్యూటీ తగ్గించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించామని చెప్పారు. బ్రిక్స్‌ దేశాల మధ్య లావాదేవీలకు డాలరుకు బదులు ఆయా దేశాల కరెన్సీ మార్పిడి జరగాలని డిమాండ్‌ చేశామన్నారు.
 
ఇప్పటికే పెరిగిన ధరలు..: సాధారణ వాహనాల ధరలను తయారీ కంపెనీలు ఇప్పటికే పెంచాయి. ఈ–వాహనాలదీ ఇదే పరిస్థితి. ధర సవరణపై కస్టమర్లకు సమాచారం ఉండదని వెంకట రమణ అన్నారు. ‘ఎలక్ట్రిక్‌ వాహన రంగంలో పటిష్టమైన అసోసియేషన్‌ లేదు. వాహనాలకు స్టాండర్డ్స్‌ కూడా లేవు. ఎవరి ధర వారిదే. లిథియం బ్యాటరీల ధర అంతర్జాతీయంగా తగ్గింది. కానీ డాలరు మూలంగానే ఇక్కడ ప్రైస్‌ ఎక్కువైంది’ అన్నారు. త్రీ–వీలర బ్యాటరీల ధర ఇప్పటికే 10% పైగా పెరిగాయని బబ్లి ఈ–రిక్షా దక్షిణ ప్రాంత పంపిణీదారు ఐటీ మాల్‌ ఎండీ మొహమ్మద్‌ అహ్మద్‌ పేర్కొన్నారు. మరోసారి ధరలు పెరిగే అవకాశం లేకపోలేదని చెప్పారు. పెద్ద సంస్థలు హెడ్జింగ్‌ చేస్తాయి కాబట్టి రూపాయి ఒడిదుడుకులకు లోనైనా వాహన ధరలపై ప్రభావం ఉండదని గోల్డ్‌స్టోన్‌ ఇన్‌ఫ్రాటెక్‌ ఈడీ నాగ సత్యం పేర్కొన్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top