రెండో రోజూ నష్టాలే

Coronavirus economic impact on World markets - Sakshi

ప్రపంచ ఈక్విటీ మార్కెట్లపై కరోనా వైరస్‌ ప్రభావం

సెన్సెక్స్‌ 162 పాయింట్లు డౌన్‌

67 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

ఆసియా మార్కెట్ల పరిస్థితీ ఇదే

కరోనా వైరస్‌ నియంత్రణలోకి రాకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా సోమవారం ఈక్విటీ మార్కెట్లు నష్టపోయాయి.  వైరస్‌ కారణంగా చైనాలో పెరిగిపోతున్న మరణాలు, ప్రపంచ ఆర్థిక వృద్ధిపై దీని ప్రతికూల ప్రభావాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేశాయి. దీంతో మన మార్కెట్లతోపాటు నికాయ్, హాంగ్‌కాంగ్, సియోల్, తైపీ, జకార్తా మార్కెట్లు అర శాతం వరకు నష్టపోయాయి. సిడ్నీ 0.1 శాతంతో ముగియగా.. కరోనా బాధిత దేశం చైనాలోని షాంఘై మార్కెట్లు తొలుత అర శాతం నష్టపోగా, ఆ తర్వాత కోలుకుని అర శాతం లాభంతో ముగిశాయి. యూరోప్‌ మార్కెట్లు కూడా నష్టాలతోనే ఆరంభమయ్యాయి.

చైనా ద్రవ్యోల్బణ గణాంకాలు సోమవారం విడుదల కాగా, వినియోగ ఉత్పత్తుల ధరలు ఎనిమిదేళ్లలోనే అత్యధికంగా పెరిగాయి. ఆహార ఉత్పత్తుల ధరలు 20 శాతం పెరిగాయి. కరోనా వైరస్‌ ప్రభావం ద్రవ్యోల్బణ గణాంకాల రూపంలో ప్రతిఫలించింది. చైనా వ్యాప్తంగా ముఖ్యమైన తయారీ కేంద్రాలను కూడా మూసేస్తున్నారు. యాపిల్‌కు సరఫరాదారుగా ఉన్న ఫాక్స్‌కాన్, వాహన దిగ్గజం టయోటాకూ సరఫరా ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రతికూలతలు మన మార్కెట్లపై ప్రసరించడంతో సెన్సెక్స్‌ 162 పాయింట్లు నష్టపోయి 40,980 వద్ద క్లోజయింది. ఇంట్రాడేలో 373 పాయింట్ల శ్రేణిలో కదలాడింది. అటు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 67 పాయింట్ల నష్టంతో 12,031 వద్ద క్లోజయింది. ప్రధానంగా మెటల్, ఆటో రంగ షేర్లలో అమ్మకాలు ఎక్కువగా జరిగాయి.

ఎంఅండ్‌ఎం 7 శాతం డౌన్‌  
అత్యధికంగా మహీంద్రా అండ్‌ మహీంద్రా 7% నష్టపోయింది. డిసెంబర్‌ త్రైమాసిక ఫలితాలు నిరుత్సాహకరంగా ఉండడం భారీ నష్టాలకు దారితీసింది. టాటా స్టీల్‌ 6%, ఓఎన్‌జీసీ 3%, సన్‌ఫార్మా, హీరో మోటోకార్ప్‌ 2 శాతం చొప్పున క్షీణించాయి. లాభపడిన వాటిల్లో టీసీఎస్, బజాజ్‌ఫైనాన్స్, ఏషియన్‌ పెయింట్స్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌యూఎల్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఉన్నాయి. జనవరిలో ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు 6 శాతానికి పైగా తగ్గినట్టు సియామ్‌ గణాంకాలను విడుదల చేయడం ఆటో రంగ స్టాక్స్‌పై ప్రభావం చూపింది. కరోనా వైరస్‌ వల్ల మరణాలు సార్స్‌ మరణాలను దాటుతుండడం దాని తీవ్రతపై ప్రమాద ఘంటికలను మోగిస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top