
లాక్‌డౌన్ నిబంధనలు పాటించాలన్న కేంద్ర ప్రభుత్వం
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1553 పాజిటివ్ కేసులు నమోదవగా 36 మంది మరణించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 17,265 కేసులు నమోదయ్యాయని, 543 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. మహమ్మారి బారి నుంచి కోలుకుని 2546 మంది డిశ్చార్జి అయ్యారని తెలిపారు. లాక్‌డౌన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. లాక్‌డౌన్‌పై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పలు సూచనలు చేసిందని ఆయన గుర్తు చేశారు. ఇక గోవాలో కరోనా కేసులు లేవని, లాక్‌డౌన్ కారణంగా కరోనా గ్రోత్ రేట్ తగ్గిందని లవ్ అగర్వాల్ పేర్కొన్నారు.
ఇక మహారాష్ట్రలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ముంబైలో 53 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం కలకలం రేపింది. మహారాష్ట్రలో ఇప్పటివరకూ 4203 కరోనా కేసులు నమోదవగా 223 మంది మరణించారు. మధ్యప్రదేశ్‌లో 1407 కేసులు నమోదవగా 70 మంది మరణించారు. మరోవైపు పశ్చిమబెంగాల్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 339కి పెరగ్గా మృతుల సంఖ్య 12కి చేరింది. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే వైరస్ వ్యాప్తి మరింత విశృంఖలమవుతుందని ప్రజలు సంయమనంతో నిబంధనలు పాటించి ఇళ్లకే పరిమితం కావాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోరింది.