బీఓఐ నష్టం రూ.2,341 కోట్లు

BOI loss of Rs.2,341 crores - Sakshi

రెట్టింపునకు మించిన కేటాయింపులు  

తగ్గిన నికర వడ్డీ ఆదాయం  

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.2,341 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. మొండి బకాయిలకు కేటాయింపులు  రెట్టింపునకు పైగా మించడంతో పాటు, నికర వడ్డీ, ఇతర, నిర్వహణ ఆదాయాలు తగ్గడంతో ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది.

గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.102 కోట్ల నికర లాభం సాధించామని పేర్కొంది. గత క్యూ3లో రూ.11,594 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో 10,376 కోట్లకు తగ్గిందని తెలిపింది. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.2,546 కోట్ల నుంచి రూ.4,373 కోట్లకు పెరిగాయని పేర్కొంది. నికర వడ్డీ ఆదాయం 18 శాతం తగ్గి రూ.2,501 కోట్లకు, ఇతర ఆదాయం 70 శాతం క్షీణించి రూ.1,041 కోట్లకు, నిర్వహణ లాభం 82 శాతం క్షీణించి రూ.1,354 కోట్లకు తగ్గాయని తెలిపింది.

పెరిగిన మొండి బకాయిలు  
స్థూల మొండి బకాయిలు 13.38 శాతం నుంచి 16.93 శాతానికి, నికర మొండి బకాయిలు 7.09 శాతం నుంచి 10.29 శాతానికి ఎగిశాయని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. సీక్వెన్షియల్‌గా చూస్తే, స్థూల మొండి బకాయిలు 30 శాతం వృద్ధితో రూ.64,249 కోట్లకు, నికర మొండి బకాయిలు 53 శాతం వృద్ధితో రూ.36,117 కోట్లకు పెరిగాయని వివరించింది.

గత ఆర్థిక సంవత్సరానికి అవకతవకలు(డైవర్జెన్స్‌–ఆర్‌బీఐ మదింపు, బ్యాంక్‌ వెల్లడించిన వాటికి మధ్య గల తేడా) స్థూల మొండి బకాయిల్లో  రూ.14,000 కోట్లు, నికర మొండి బకాయిల్లో రూ.9,707 కోట్లు,  కేటాయింపుల్లో రూ.4,350 కోట్ల మేర ఉన్నాయని వివరించింది. ప్రొవిజన్‌ కవరేజ్‌ రేషియో 56.96 శాతంగా ఉందని తెలిపింది.   ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేర్‌ 1.6 శాతం లాభంతో రూ.145 వద్ద ముగిసింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top