నేడు, రేపు గ్రామీణ బ్యాంక్ ఉద్యోగుల సమ్మె | Sakshi
Sakshi News home page

నేడు, రేపు గ్రామీణ బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Published Thu, Mar 10 2016 12:31 AM

నేడు, రేపు గ్రామీణ బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

దేశవ్యాప్తంగా 20 వేల బ్రాంచీల్లో
నిలిచిపోనున్న కార్యకలాపాలు..

హైదరాబాద్: గ్రామీణ బ్యాంక్ ఉద్యోగులు గురు, శుక్రవారాల్లో దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నారు. తదనంతరం రెండు రోజులు ప్రభుత్వ సెలవు దినాలు కావడంతో వరుసగా నాలుగు రోజులు గ్రామీణ బ్యాంకులు పనిచేయని పరిస్థితి నెలకొంది.  గ్రామీణ బ్యాంకుల ఏడు ఉద్యోగ సం ఘాల జాతీయ స్థాయి ఐక్య వేదిక- యునెటైడ్ ఫోరమ్ ఆఫ్ ఆర్.ఆర్.బి యూనియన్స్ (యూఎఫ్‌ఆర్‌ఆర్‌బీయూ) పిలుపు మేరకు దేశంలోని 56 గ్రామీణ బ్యాంకుల్లోని ఉద్యోగులు, అధికారులు 10,11 తేదీల్లో జరిగే సమ్మెలో పాల్గొననున్నారు. దీనితో 20 వేలకు పైగా శాఖలు రెండు రోజులు మూతపడనున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 8 జిల్లాల్లోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాశ్ బ్యాంక్ సిబ్బంది ఈ సమ్మెలో పాల్గొననున్నట్లు ఒక ప్రకటన తెలిపింది. బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ),  నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రీజినల్ రూరల్ బ్యాంక్ ఆఫీసర్స్, ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల గ్రామీణ బ్యాంకుల ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతూ వేర్వేరు ప్రకటనలు విడుదల చేశాయి.

 గ్రామీణ బ్యాంకులు, ఉద్యోగుల పట్ల కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్షతకు నిరసనగా ఈ సమ్మె చేస్తున్నట్లు తెలిపాయి. 10వ వేతన సవరణలోని అన్ని ఇతర అలవెన్సులు కమర్షియల్ బ్యాంకుల్లో అమలు చేసి 10 నెలలు గడుస్తున్నా... ఆయా ప్రయోజనాలను గ్రామీణ బ్యాంకులకు ఇంకా వర్తింపజేయలేదు. కమర్షియల్ బ్యాంకు ఉద్యోగులతో సమానంగా పెన్షన్ స్కీమ్‌ను అమలు చేయాలని సైతం గ్రామీణ బ్యాంక్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement
Advertisement