బ్యాంకుల్లో 33 శాతానికి వాటా తగ్గించుకోవాలి

Banks to reduce the share of 33 per cent - Sakshi

పీఎస్‌బీలపై సీఐఐ సూచన

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకుల్లో (పీఎస్‌బీ) కేంద్ర ప్రభుత్వం తన వాటాను రానున్న రెండు మూడేళ్లలో 33 శాతానికి తగ్గించుకోవాలని సీఐఐ డిమాండ్‌ చేసింది. మొండి బకాయిల సమస్యతో కుదేలవుతున్న పీఎస్‌బీలకు కేంద్రం రీక్యాపిటలైజేషన్‌ సాయం చేస్తున్న నేపథ్యంలో సీఐఐ ఈ సూచన చేసింది. తక్షణ ప్రాదిపదికన ప్రభుత్వం తన వాటాను 52 శాతం వరకు తగ్గించుకునేందుకు పబ్లిక్‌ ఇష్యూకు వెళ్లే అవకాశాన్ని పరిశీలించాలని, 33 శాతానికి తగ్గించుకోవడం వచ్చే మూడేళ్ల కాలానికి లక్ష్యంగా పెట్టుకోవాలని సీఐఐ తన ప్రకటనలో పేర్కొంది.

ప్రాధాన్య అవసరాల రీత్యా ఎస్‌బీఐలో గణనీయమైన వాటాను ప్రభుత్వం ఉంచుకోవచ్చని అభిప్రాయపడింది. వాటాలను తగ్గించుకోవడం అన్నది ఈక్విటీ షేర్ల రూపంలో కాకుండా ప్రిఫరెన్స్‌ షేర్ల రూపంలో ఉండొచ్చని పేర్కొంది. ప్రస్తుతం పీఎస్‌బీల్లో ప్రభుత్వం వాటా 58 శాతం, అంతకంటే ఎక్కువే ఉందని సీఐఐ తెలిపింది. ‘‘చాలా వరకు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో సర్కారు వాటా 80 శాతం పైనే ఉంది. కేవలం నాలుగు బ్యాంకుల్లో వాటా ఈ ఏడాది మార్చి నాటికి 58 శాతానికి తగ్గింది.

2018 ఏప్రిల్‌ 1 నుంచి బ్యాంకులకు నూతన అకౌంటింగ్‌ ప్రమాణాలు అమల్లోకి రానున్నాయి. దీంతో మొండి రుణాలకు కేటాయింపులు 30 శాతం మేర పెంచాల్సి రావచ్చు. ఫలితంగా బ్యాంకులకు నిధుల అవసరాలు పెరుగుతాయి’’ అని సీఐఐ పేర్కొంది. దీంతో బ్యాంకులకు రీక్యాపిటలైజేషన్‌కు సంబంధించి సర్కారు ఆరు పాయింట్ల అజెండాను రూపొందించుకోవాలని సీఐఐ సూచించింది. బ్యాంకులకు వచ్చే రెండేళ్ల కాలంలో రూ.2.11 లక్షల కోట్ల మేర పీఎస్‌బీలకు రీక్యాపిటలైజేషన్‌ సాయాన్ని అందించనున్నట్టు కేంద్రం ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top