రుణ రేట్ల సమీక్షకు బ్యాంకర్లు ఓకే

bankers Ready For Loan Rates Review - Sakshi

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశంలో అంగీకారం

న్యూఢిల్లీ: ఆర్‌బీఐ రేట్ల తగ్గింపు ప్రయోజనాలను రుణ గ్రహీతలకు బ్యాంకులు పూర్తి స్థాయిలో అందించని పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బ్యాంకర్లతో సోమవారం చర్చించారు. రుణ రేట్లను సమీక్షించేందుకు బ్యంకర్లు అంగీకారం తెలిపారు. గత డిసెంబర్‌ నుంచి ఆర్‌బీఐ ఇప్పటి వరకు 75 బేసిస్‌ పాయింట్ల మేర రుణ రేట్లను తగ్గించినప్పుటికీ, ఆ స్థాయిలో రుణాలపై రేట్లు తగ్గని విషయం తెలిసిందే. ‘‘బ్యాంకులు రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని రుణాలకు బదలాయించాల్సిన అవసరం ఉంది. ఆర్‌బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా రుణ రేట్లను సమీక్షించి చర్యలు తీసుకుంటామని బ్యాంకులు సమావేశంలో అంగీకరించాయి’’అని మంత్రి అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకుల చీఫ్‌లు, ప్రైవేటు రంగంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు, కోటక్‌ బ్యాంకు, సిటీ బ్యాంకు తదితర బ్యాంకుల సారథులతో సమావేశం అనంతరం మంత్రి నుంచి ప్రకటన వెలువడింది. ఎంఎస్‌ఎంఈ, ఆటోమొబైల్‌ రంగాలకు రుణ వితరణ వృద్ధితోపాటు సకాలంలో రేట్ల తగ్గింపు ప్రయోజనాల బదిలీ, డిజిటైజేషన్, సేవల పన్ను సంబంధిత అంశాలు సమావేశంలో చర్చకు వచ్చినట్టు ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్‌కుమార్‌ తెలిపారు. 

పలు రంగాల ప్రతినిధులతో సమావేశమవుతా
పలు రంగాల ప్రతినిధులతో తాను సమావేశమై, సత్వర చర్యలు తీసుకుంటామని మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. సోమవారం బ్యాంకుల చీఫ్‌లతో భేటీ అయినట్టుగానే... ఈ వారంలోనే ఎంఎస్‌ఎంఈ ప్రతినిధులు, ఆటోమొబైల్‌ రంగం, వాణిజ్య సంఘాలు, రియల్‌ ఎస్టేట్‌ ప్రతినిధులతోనూ మంత్రి సమావేశం కానున్నారు. వారి అభిప్రాయాలను విని, తగురీతిలో, సత్వరమే చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు.

ఎఫ్‌పీఐ ప్రతినిధులతో మాట్లాడుతా
న్యూఢిల్లీ: అధిక ఆదాయ వర్గాలపై బడ్జెట్‌లో సర్‌చార్జీ భారీ పెంపు అనంతరం నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) భారత క్యాపిటల్‌ మార్కెట్లలో అమ్మకాలు కొనసాగిస్తుండడంతో, ఎఫ్‌పీఐ ప్రతినిధులతో త్వరలోనే చర్చలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం ప్రకటించారు. సౌర్వభౌమ బాండ్ల జారీకి సంబంధించి బడ్జెట్‌లో ప్రకటన మినహా దానికి సంబంధించి అదనంగా ఇప్పటి వరకు ఏ చర్యలు తీసుకోలేదని స్పష్టం చేశారు. ఈ రెండు నిర్ణయాలపై వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో కేంద్రం పునరాలోచనలో పడినట్టు మంత్రి వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. ఆర్థిక శాఖ పరిధిలోని ఎకనమిక్‌ అఫైర్స్‌ విభాగం కార్యదర్శి అతను చక్రవర్తి ఎఫ్‌ఫీఐల ప్రతినిధులతో చర్చలు నిర్వహిస్తారని మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ‘‘వారు (ఎఫ్‌పీఐలు) చెప్పదలుచుకున్నదాన్ని వినేందుకు నేను సిద్ధంగా ఉన్నాను’’ అని ప్రకటించారు. ఈ నెల మొదటి రెండు రోజుల్లోనే ఎఫ్‌ఫీఐలు డెట్, ఈక్విటీల నుంచి రూ.2,985 కోట్ల మేర పెట్టుబడులను వెనక్కి తీసేసుకున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top