నేడు దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె

Bank employee unions strike on October 22 - Sakshi

విలీనాలు, ఇతర అంశాలకు నిరసన

సమ్మె ప్రభావం స్వల్పమేనంటున్న ఎస్‌బీఐ

న్యూఢిల్లీ/కోల్‌కతా:  బ్యాంక్‌ల విలీనానికి నిరసనగా నేడు(మంగళవారం) కొన్ని బ్యాంక్‌ యూనియన్లు సమ్మె చేయనున్నాయి. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ సర్వీసులకు అంతరాయం ఏర్పడనున్నది. బ్యాంక్‌ల విలీనాలు, డిపాజిట్ల రేట్ల తగ్గింపు, ఉద్యోగ భద్రతకు సంబంధించిన కొన్ని అంశాలపై నిరసన తెలియజేస్తూ ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌(ఏఐబీఈఏ), బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(బీఈఎఫ్‌ఐ)లు బ్యాంక్‌ యూనియన్లు జాతీయ స్థాయిలో 24 గంటల సమ్మెకు పిలుపునిచ్చాయి.  అయితే బ్యాంక్‌ ఆఫీసర్లు, ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌లు, ఈ సమ్మెలో పాల్గొనడం లేదు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌లు, సహకార బ్యాంక్‌లు కూడా ఈ సమ్మెలో పాల్గొనడం లేదు. బ్యాంక్‌ల విలీనం వీటిపై ఎలాంటి ప్రభావం చూపనందున ఇవి ఈ సమ్మెలో పాల్గొనడం లేదు.  

సమ్మె కొనసాగుతుంది....
ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులతో చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌ సమక్షంలో జరిగిన చర్చలు విఫలమయ్యాయని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి సీ.హెచ్‌. వెంకటాచలమ్‌ పేర్కొన్నారు. అందుకని సమ్మె కొనసాగుతుందని తెలిపారు. సమ్మె పరిధిలోనే ఉన్నందున ఏటీఎమ్‌లను కూడా మూసేస్తామని బ్యాంక్‌ యూనియన్లు పేర్కొన్నాయి. కొన్ని బ్యాంక్‌ ఉద్యోగాలను  అవుట్‌ సోర్సింగ్‌కు ఇవ్వడం, బ్యాంకింగ్‌ రంగాన్ని ప్రైవేటీకరించడాన్ని ఈ యూనియన్లు వ్యతిరేకిస్తున్నాయి. తగిన స్థాయిల్లో బ్యాంక్‌ క్లర్క్‌లను నియమించాలని, భారీగా పేరుకుపోతున్న మొండి బకాయిల రికవరీకి గట్టి చర్యలను తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి.  

ప్రభావం స్వల్పమే !..
పలు బ్యాంక్‌లు ఇప్పటికే సమ్మె విషయమై తమ ఖాతాదారులను అప్రమత్తం చేశాయి. సమ్మెకు పిలుపునిచ్చిన బ్యాంక్‌ సంఘాల్లో తమ ఉద్యోగుల సభ్యత్వం తక్కువగా ఉందని, ఈ సమ్మె ప్రభావం బ్యాంక్‌ కార్యకలాపాలపై స్వల్పంగానే ఉంటుందని ఎస్‌బీఐ వెల్లడించింది. సమ్మె కారణంగా ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని సిండికేట్‌ బ్యాంక్‌ పేర్కొంది. అయితే సమ్మె జరిగితే, కార్యకలాపాలపై ప్రభావం ఉండగలదని వివరించింది. గత నెలలో 26, 27 తేదీల్లో బ్యాంక్‌ల సమ్మెకు ఆఫీసర్ల యూనియన్లు పిలుపునిచ్చాయి. కానీ, ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో ఆ యూనియన్లు సమ్మెను విరమించాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top