
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ఎల్‌ఈడీ లైట్లలో లైట్ ఆటోమిషన్ ట్రెండ్ నడుస్తోంది. ఈ రకమైన ఎల్‌ఈడీ లైట్లు గదిలోకి రాగానే దానంతటదే లైట్ ఆన్ అవుతుంది. వెళ్లిపోగానే ఆఫ్ అవుతుంది. టీవీ సౌండ్ పెంచినట్టుగా రిమోట్ సహాయంతో లైట్ వెలుతురు (లుమిన్స్)ను ఎక్కువ, తక్కువ చేసుకోవచ్చు కూడా. ఇక వెబ్ బేస్డ్ సొల్యుషన్స్ ఎల్‌ఈడీ లైట్లయితే ఇంటర్నెట్ సహాయంతో ఐఫోన్, ఐప్యాడ్‌ల నుంచే ఆపరేట్ చేసుకోవచ్చు. ఇవి ఎక్కువగా రెస్టారెంట్లు, పబ్బులు, గేమింగ్ జోన్లు, థియేటర్లు, షామింగ్ మాళ్లులో వినియోగిస్తుంటారు.
బల్బు, సీఎఫ్‌ఎల్, ట్యూబ్‌లైట్లతో పోల్చుకుంటే ఎల్‌ఈడీ లైట్ల ధర కాస్త ఎక్కువే. కానీ, విద్యుత్ వినియోగం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. 18 ఓల్టుల ఎల్‌ఈడీ లైట్ ధర రూ. 1,500-1,800 మధ్య ఉంటుంది. 1,000 చ.అ. ఇంటికి రూ. 8 లక్షలతో వెబ్ బేస్డ్ సొల్యుషన్స్ ఎల్‌ఈడీ లైట్లను అమర్చుకోవచ్చు. 300 గజాల ఇండిపెండెంట్ హౌజ్ గార్డెనింగ్‌కు రూ. 3 లక్షలు ఖర్చవుతుంది. ఎకరం విస్తీర్ణంలో ఉన్న ఫంక్షన్ హాల్‌కు రూ. 40 లక్షలు, షాపింగ్ మాళ్లకు చదరపు అడుగుకు రూ. 500 నుంచి రూ. 1,000 వరకు ఖర్చవుతుంది.