టెక్‌ మహీంద్రాకు భారీ డీల్‌

AT&T Deal With Tech Mahindhra - Sakshi

ఏటీ అండ్‌ టీ నుంచి-డీల్‌ విలువ వంద కోట్ల డాలర్లకు మించి !

పుణే: ఐటీ దిగ్గజం టెక్‌ మహీంద్రా భారీ డీల్‌ను సాధించింది. అమెరికాకు చెందిన టెలికం కంపెనీ ఏటీ అండ్‌ టీ, నుంచి ఈ కాంట్రాక్ట్‌ను సాధంచామని టెక్‌ మహీంద్రా తెలిపింది. ఏటీ అండ్‌ టీ కంపెనీ తన ఐటీ నెట్‌వర్క్‌ను అధునికీకరించడం కోసం ఈ డీల్‌ను కుదుర్చుకుందని టెక్‌ మహీంద్రా చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ మనోజ్‌ భట్‌ పేర్కొన్నారు. డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలను ఆయన వెల్లడించలేదు. అయితే ఈ డీల్‌ విలువ వంద కోట్ల డాలర్లకు మించి ఉంటుందని అంచనా. దాదాపు ఆరేళ్ల కాలంలో తాము సాధించిన అతి పెద్ద డీల్‌ ఇదేనని  భట్‌ పేర్కొన్నారు.  ఈ డీల్‌ కాలపరిమితి ఆరున్నర సంవత్సరాలని తెలిపారు. 2013లో ఈ కంపెనీ బ్రిటిష్‌ టెలికం కంపెనీ బీటీతో వంద కోట్ల డాలర్లకు మించిన ఒప్పందాన్ని కుదుర్చుకున్నది.

మరింత మెరుగైన సేవలు....
టెక్‌ మహీంద్రాతో ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల మరింత మెరుగైన సేవలను అందించగలుగుతామని ఏటీ అండ్‌ టీ సీఐఓ జాన్‌ సమ్మర్స్‌ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జూన్‌కల్లా అమెరికా వ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేయాలన్న తమ లక్ష్యం సులభంగానే సాకారం కాగలదని వివరించారు.కాగా టెక్‌ మహీంద్రా కంపెనీ వార్షిక ఆదాయం దాదాపు 500 కోట్ల డాలర్ల మేర ఉంటుంది. దీంట్లో 21 శాతం వరకూ ఏటీ అండ్‌ టీ, బీటీ వంటి అగ్రశ్రేణి కంపెనీల నుంచే వస్తోంది. ఇక కంపెనీ మొత్తం ఆదాయంలో టెలికమ్యూనికేషన్స్‌ విభాగం వాటా 40 శాతానికి మించి ఉంటుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top