పసిడి... దీర్ఘకాలంలో పటిష్టమే!

Analysts predict that the price of Gold will be strong in the long run - Sakshi

ఆర్థిక అనిశ్చితి వాతావరణం

భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యం

ప్రస్తుతానికి కొంత బలహీనంగా కనబడుతున్నా... దీర్ఘకాలంలో పసిడి ధర పటిష్టంగా ఉంటుందన్నది విశ్లేషకుల అంచనా.  గడిచిన 52 వారాల్లో పసిడి ధర ఔన్స్‌ (31.1గ్రా) ధర అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌– న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్సే్చంజ్‌లో  1,248 డాలర్ల కనిష్ట స్థాయిని చూసింది. అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం, ప్రపంచం ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం, ఉత్తరకొరియా, ఇరాన్‌ వంటి దేశాలకు సంబంధించి భౌగోళిక ఉద్రిక్తతలు వంటి అంశాల నేపథ్యంలో బంగారం ధర భారీగా పెరిగి నెలన్నర క్రితం 1,566 డాలర్లను తాకింది. అటు తర్వాత ప్రస్తుతం 100 డాలర్ల దిగువన 1,466 డాలర్లు–1,456 డాలర్ల శ్రేణిలో ట్రేడవుతోంది. 22వ తేదీతో ముగిసిన వారంలో 1,470 డాలర్ల వద్ద ముగిసింది. వారంవారీగా దాదాపు 15 డాలర్లు పెరిగింది. అయితే ప్రస్తుత శ్రేణి పసిడికి పటిష్టమైనదన్నది నిపుణుల విశ్లేషణ.  

లాభాల స్వీకరణే...: తాజా దిద్దుబాటు భారీగా పెరిగిన ధర నుంచి లాభాల స్వీకరణే తప్ప, పసిడి బులిష్‌ ధోరణిని కోల్పోలేదన్నది మెజారిటీ అభిప్రాయంగా ఉంది. ఈ స్థాయి నుంచి ఏ మేరకు పతనమైనా అది కొనుగోళ్లకు అవకాశమే తప్ప, ఏడాది కనిష్ట స్థాయిలను ఇప్పట్లో పసిడి చూసే అవకాశం లేదన్నది ఈ విభాగంలో నిపుణుల అభిప్రాయం. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధం సమసిపోతున్నట్లు వార్తలు వస్తున్నా... అది వాస్తవ రూపం దాల్చడంపై ఇప్పటికీ పలు సందేహాలు ఉన్నాయి. ఇక హాంకాంగ్‌ ఉద్రిక్తతలనూ ఇక్కడ ప్రస్తావించుకోవాల్సిన అంశం. ఇవన్నీ దీర్ఘకాలంలో పసిడి మరోసారి 1,566 డాలర్ల స్థాయికి చేరడానికి వీలు కల్పించే అంశాలేనన్నది అంచనా.  అయితే ప్రస్తుత శ్రేణి మద్దతు కోల్పోతే,  సమీప రోజుల్లో 1,425 డాలర్ల స్థాయిని తాకే అవకాశం ఉందన్నది విశ్లేషకుల అభిప్రాయం.

సీజనల్‌వారీగా ఈ కాలంలో పసిడి ధర కొంత తగ్గుతుండడమే దీనికి నేపథ్యం. ‘‘దీర్ఘకాలంలో పసిడి పటిష్టంగానే ఉంటుందన్నది మా అభిప్రాయం. పసిడిని కొనడానికి ఇన్వెస్టర్లు సిద్ధంగానే ఉన్నారని మాకు సమాచారం ఉంది. అయితే స్వల్పకాలికంగా అమెరికా–చైనా చర్చలపై వారు దృష్టి సారించారు. పసిడి 1,450 డాలర్ల వైపు కదిలితే అది కొనుగోళ్లకు చక్కటి అవకాశం. 2020లో సగటున ధర 1536 డాలర్లుగా ఉంటుందన్నది మా అంచనా’’ అని స్టాండెర్డ్‌ చార్టర్డ్‌ ప్రీసియస్‌ మెటల్స్‌ విశ్లేషకులు– సుకీ కూపర్‌ తెలిపారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top