ఆన్‌లైన్ అమ్మకాలపైనే దృష్టి

ఆన్‌లైన్ అమ్మకాలపైనే దృష్టి


* కొత్తగా రెండు ఆన్‌లైన్ పథకాలు ఆవిష్కరణ

* ఎగాన్ రెలిగేర్ లైఫ్ సీవోవో యతీష్ శ్రీవాత్సవ


హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్‌లైన్ బీమా వ్యాపారంపైనే ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు ప్రైవేటు రంగ జీవిత బీమా కంపెనీ ఎగాన్ రెలిగేర్ ప్రకటించింది. దేశంలో స్మార్ట్‌ఫోన్ల రాకతో ఇంటర్నెట్ వినియోగం పెరుగుతుండటంతో కొత్తగా కార్యాలయాలు ఏర్పాటు చేయడం కంటే మరిన్ని సేవలను అన్‌లైన్‌లో అందించడంపై దృష్టిసారిస్తున్నట్లు ఎగాన్ రెలిగేర్ లైఫ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యతీష్ శ్రీవాత్సవ తెలిపారు.



ప్రస్తుతం బీమా పథకాల అమ్మకాల్లో 21 శాతం, కొత్త ప్రీమియం ఆదాయంలో 14 శాతం ఆన్‌లైన్ ద్వారా వస్తోందని, రానున్న కాలంలో దీన్ని మరింత పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో రెండు ఆన్‌లైన్ బీమా పథకాలను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీవాత్సవ మాట్లాడుతూ ఇన్వెస్టర్లు ఇప్పుడిప్పుడే యులిప్ పథకాల కేసి చూస్తున్నట్లు తెలిపారు.  



స్టాక్ మార్కెట్లు పెరుగుతుండటం, మ్యూచువల్ ఫండ్ రాబడులకు తగ్గట్టుగా యులిప్స్ రాబడులు ఉండటం, చార్జీలు తగ్గడం వంటి అంశాలు యులిప్స్‌ను ఆకర్షించేటట్లు చేస్తున్నాయన్నారు. అందుకోసమే కేవలం ఆన్‌లైన్ ద్వారా ఇన్వెస్ట్ చేసే విధంగా ‘ఐ మాగ్జిమైజ్’ పేరుతో యులిప్ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు యతీష్ శ్రీవాత్సవ తెలిపారు.

 

2018 తర్వాతే లాభాల్లోకి!

వచ్చే మూడేళ్లలో లాభనష్ట రహిత స్థితికి చేరుకోగలమన్న ధీమాను శ్రీవాత్సవ వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక ఏడాది తొమ్మిది నెలల కాలంలో దేశీయ బీమా రంగం 8 శాతం వృద్ధిని నమోదు చేస్తే తాము 30% వృద్ధిని సాధించినట్లు తెలిపారు.

 

కొత్త పథకాలు ఇవీ...


అంతకుముందు ఆన్‌లైన్ యులిప్ పథకం ‘ఐ మాగ్జిమైజ్’, ఆన్‌లైన్ విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం టర్మ్ పథకం ‘ఐ రిటన్’ను మార్కెట్లోకి లాంఛనంగా విడుదల చేశారు. ఐ మాగ్జిమైజ్‌లో ఇన్వెస్‌మెంట్‌కు మూడు రకాల ఫండ్ ఆప్షన్ అందుబాటులో ఉన్నాయి. కనీస వార్షిక ప్రీమియం రూ. 24,000. అదే ‘ఐ రిటన్’ విషయానికి వస్తే కనీస బీమా మొత్తం రూ. 30 లక్షల కోసం 30 ఏళ్ళ వ్యక్తి 20 ఏళ్లకు ఐ రిటర్న్ పాలసీ తీసుకుంటే ఏటా సుమారు రూ. 10,950 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top