మండలాల వారీగా ఆస్పత్రులకు మ్యాపింగ్‌

Zonal wise mapping to hospitals - Sakshi

దీనివల్ల జబ్బులను గుర్తించడం సులువవుతుందని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం 

ప్రతి మండలంలో పీహెచ్‌సీలు, సబ్‌ సెంటర్లు, జనాభా గుర్తింపు 

ఆస్పత్రుల్లో సిబ్బంది సంఖ్య నిర్ధారణ

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖలో భారీ ఎత్తున సంస్కరణలు చేపట్టిన నేపథ్యంలో మండలాల వారీగా ఆస్పత్రులకు మ్యాపింగ్‌ నిర్వహించేందుకు ఆరోగ్య శాఖ అధికారులు కసరత్తు మొదలెట్టారు. ప్రతి మండలం పరిధిలో ఎన్ని ఆరోగ్య ఉపకేంద్రాలున్నాయి, ఎన్ని ప్రాథమిక ఆస్పత్రులున్నాయి, ఏరియా ఆస్పత్రులెన్ని, జిల్లా ఆస్పత్రులు, బోధనాస్పత్రులు ఇలా ప్రతి ఆరోగ్య సంస్థను గుర్తించి, వాటికి మ్యాపింగ్‌ ప్రక్రియ చేపడుతున్నారు. దీనివల్ల ప్రతి ప్రాంతంలోనూ ఆస్పత్రుల స్థితిగతులు తెలుసుకునే వీలుంటుంది. కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 40 వేల మంది ఉంటున్నారు. కొన్ని చోట్ల 20 వేల మందికే ఒక పీహెచ్‌సీ ఉంది. కొన్ని పీహెచ్‌సీల్లో రోగుల తాకిడి లేకపోయినా ఇద్దరు చొప్పున మెడికల్‌ ఆఫీసర్లున్నారు. మరికొన్నింటికి రోగులు వస్తున్నా డాక్టర్లు లేరు. ప్రధానంగా ప్రతి చిన్న ఆస్పత్రి నుంచి పెద్దాస్పత్రి వరకూ సిబ్బంది వివరాలు ఈ మ్యాపింగ్‌ ప్రక్రియలో వెల్లడి కానున్నాయి.  

ఇక సంస్కరణలు వేగవంతం 
రాష్ట్రంలో ఉన్న అన్ని ఆరోగ్య సంస్థల వివరాలు, వాటి పరిధిలో జనాభా, ఆస్పత్రి ఉన్న ప్రాంతం, సిబ్బంది ఇలా అన్నింటినీ కలిపి మ్యాపింగ్‌ ప్రక్రియలోకి తెస్తారు. త్వరలోనే ఇ–హెల్త్‌ రికార్డులను రూపొందించనున్న నేపథ్యంలో ఇలా మ్యాపింగ్‌ చేపడితే ఏ ప్రాంతంలో ఏ జబ్బులు ఎక్కువగా ఉన్నాయి, ముందస్తు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా అంచనాకు వచ్చే అవకాశం ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి.

ఇప్పటివరకు ఎక్కడ ఏ ఆస్పత్రి ఉందో, ఆ జిల్లాలో ఎవరు పనిచేస్తున్నారో ఆ జిల్లాలో అధికారులను అడిగి తెలుసుకోవడం, లేదా స్థానికంగా వచ్చిన సమాచారం మేరకే తెలిసేది. ఇకపై అలా కాకుండా మండలాల వారీగా వీటన్నిటినీ మ్యాపింగ్‌ పేరుతో ఒకే గొడుగు కిందకు తీసుకొస్తే ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు వీలవుతుంది. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖలో సంస్కరణల కోసం ఏర్పాటైన నిపుణుల కమిటీ ఈ నెల 30లోగా నివేదిక ఇవ్వనుంది. ఈలోగా మ్యాపింగ్‌ పూర్తి చేస్తే సంస్కరణలకు సులువుగా ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. క్షేత్రస్థాయిలో ఆస్పత్రుల్లో పరిస్థితులన్నిటినీ మ్యాపింగ్‌ ప్రక్రియ కిందకు తీసుకొస్తే సంస్కరణలు వేగవంతమవుతాయని అంటున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top