మంత్రిగారూ.. డిగ్రీ కళాశాల ఏదీ ?

YSRCP Vizag Ramakrishna Comments On Ganta Srinivasa Rov - Sakshi

హామీ ఇచ్చి ఏడాది పూర్తయినా అతీగతీలేదు

వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వీసం రామకృష్ణ

నక్కపల్లి(పాయకరావుపేట) : పాయకరావుపేట నియోజకవర్గంలో గత విద్యా సంవత్సరంలోనే డిగ్రీకళాశాల ఏర్పాటు చేసి తరగతులు ప్రారంభిస్తామని జిల్లాకు చెందిన విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత  ఇచ్చిన హమీ ఏమైందని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వీసం రామకృష్ణ ప్రశ్నించారు.  ఏడాది ముగిసి రెండో ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభమైనా ఇంకా డిగ్రీ కళాశాలకు మోక్షం కలగలేదన్నారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు.

ఏడాది క్రితం ఈ ప్రాంత పర్యటనకు వచ్చిన మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ విద్యా సంవత్సరంలోనే డిగ్రీ తరగతులు ప్రారంభమవుతాయని, భవనాలు కూడా గుర్తించినట్టు  ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.  ఎన్నికల ముందు టీడీపీ నాయకులు ఇచ్చిన హమీల్లో ఒక్కటి కూడా నెరవేరలేదన్నారు.  నక్కపల్లిలో డిగ్రీ కళాశాల ఏర్పాటు, గొడిచర్లలో జూనియర్‌ కళాశాల, మత్య్స కారుల కోసం ప్రత్యేక రెసిడెన్షియల్‌ పాఠశాల, చినదొడ్డిగల్లులో అసంపూర్తిగా ఉన్న పీహెచ్‌సీని పూర్తిచేయడం, నక్కపల్లి 30 పడకల ఆస్పత్రిని 50 పడకల స్థాయి ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేస్తామని, పాయకరావుపేట పట్టణంలో మెయిన్‌రోడ్డును విస్తరిస్తామంటూ  హమీలు గుప్పించారన్నారు. వీటిలో  ఏఒక్కటీ నెరవేరలేదన్నారు. ఈ ప్రాంతంలో డిగ్రీకళాశాల లేక విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని చెప్పారు.

రైన సదుపాయాలు లేక పట్టణ ప్రాంతాలకు వెళ్లి ప్రైవేటు కళాశాలల్లో వేలాది రూపాయలు వెచ్చించి డిగ్రీ చదవలేక చదువుకు మధ్యలో స్వస్తి పలుకుతున్నారన్నారు. నియోజకవర్గంలో రూ.200 కోట్లతో అభివృద్ధిపనులు చేశామని ఉపన్యాసాలు ఇస్తున్న తెలుగు దేశం నాయకులు నెరవేరని ఈ హమీల గురించి ఏ  సమాధానం చెబుతారని ప్రశ్నించారు. నియోజకవర్గ ప్రజలకు కావాల్సినవి ఇవేనన్నారు.  గ్రామీణ ఉపాధి హమీ పథకం నిధులతో రోడ్లు, పంచాయతీ భవనాలు, కాలువలు, అంగన్‌వాడీ భవనాలు నిర్మిస్తున్నామని గొప్పలు చెబుతున్నారని వాస్తవంగా ఈ నిధులు కేంద్రప్రభుత్వం విడుదల చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి పైసా సంబంధం లేదన్నారు. డిగ్రీకళాశాల ఏర్పాటు చేసేస్తున్నామంటూ విద్యార్థులను మోసం చేశారన్నారు. నాలుగేళ్ల నుంచి వేలాది మంది విద్యార్థులు డిగ్రీకళాశాల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. చిత్తశుద్ధి ఉంటే తక్షణమే  ఎన్నికల ముందు ఇచ్చిన హమీలు నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top