సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలో పది నియోజకవర్గాల సమన్వయకర్త ఆధ్వర్యంలో మంగళవారం రిలే నిరాహరదీక్షలు ప్రారంభమయ్యాయి.
సాక్షి, నెల్లూరు : సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలో పది నియోజకవర్గాల సమన్వయకర్త ఆధ్వర్యంలో మంగళవారం రిలే నిరాహరదీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ పార్టీ నేతలు, కార్యకర్తలు రిలే నిరాహారదీక్షలకు దిగారు. ఈ దీక్షలకు పార్టీ శ్రేణులు, వైఎస్సార్ అభిమానులు పెద్ద ఎత్తున మద్దతు పలికారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు రిలేదీక్షలు కొనసాగనున్నాయి.
వెంకటగిరిలో వెఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ వీరారెడ్డి ఆధ్వర్యంలో శ్రీభవానీ సెంటర్లో రిలే నిరాహారదీక్షలను ప్రారంభించారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరులో వైఎస్సార్‌సీపీ పార్టీ నాయకులు స్థానిక బస్టాండు వద్ద రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. మండల కన్వీనర్ పెద్దమల్లు రమణారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో సూ ళ్లూరుపేట బస్టాండు సెంటర్లో రిలే నిరాహారదీక్షలు చేపట్టారు.