అవినీతి పాలనకు చరమగీతం పాడుదాం

YSRCP Candidate Balineni Srinivasa Reddy Election Campaign In Ongole - Sakshi

మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ ఒంగోలు అసెంబ్లీ  అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి పిలుపు

ఐదేళ్లలో అభివృద్ధి కంటే..అవినీతే ఎక్కువ

సాక్షి, ఒంగోలు రూరల్‌: అవినీతిలో కూరుకుపోయిన తెలుగుదేశం ప్రభుత్వానికి చరమగీతం పాడుదామని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. మండల పరిధిలోని త్రోవగుంట, మండువవారిపాలెం, అంబేడ్కర్‌నగర్, గుత్తికొండవారిపాలెం, ముక్తినూతలపాడు గ్రామాల్లో గురువారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మహిళలు ఆయనపై పూలవర్షం కురిపించారు.

బాలినేని ప్రతి గ్రామంలో సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు.  జన్మభూమి కమిటీలు మాకొద్దు, వారి నియంతృత్వ పాలనను సహించలేమంటూ పెద్ద పెట్టున వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు రోడ్‌షో పొడవునా  నినాదాలు చేశారు. రోడ్‌షోలో బాలినేని మాట్లాడుతూ మీ అభిమానం చూస్తుంటే రానున్న ఎన్నికల్లో మనం భారీ మెజారిటీ సాధించడం ఖాయమన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఒంగోలు నగరానికి కలికితురాయి వంటి రిమ్స్‌ వైద్యశాలను తీసుకువచ్చానన్నారు. అలాగే మున్సిపాలిటీగా ఉన్న ఒంగోలును కార్పొరేషన్‌ చేసిన ఘనత తనదేనన్నారు.

దాని ఫలితంగానే నిధులు భారీగా మంజూరయ్యాయన్నారు. ఆ నిధులను ఐదేళ్లుగా టీడీపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసి కోట్ల రూపాయలు జేబుల్లో నింపుకున్నారన్నారు. అవొసరం లేని చోట రోడ్డు మీద రోడ్డు వేసి ఇష్టం వచ్చినట్లు కమీషన్ల దింగమింగారన్నారు. గత కొన్నేళ్లుగా తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న ఒంగోలు నగరానికి శాశ్విత పరిష్కారంగా మల్లవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి పూర్తి చేసిన ఘనత వైఎస్‌ రాజశేఖరరెడ్డిదే నన్నారు. ఫలితంగా ఒంగోలు నగరానికి తాగునీరు, ఒంగోలు, కొత్తపట్నం, మద్దిపాడు, నాగులుప్పలపాడు మండలాలకు తాగునీరు, సాగునీరు వచ్చాయన్నారు. 

సంక్షేమ పథకాలకు జన్మభూమి కమిటీల మోకాలొడ్డు..
గ్రామాల్లో జన్మభూమి కమిటీల ఏకపక్ష నిర్ణయాలతో కార్పొరేషన్‌ రుణాలు, డ్వాక్రా రుణాలు, పక్కా ఇళ్లు వంటి అర్హులకు అందకుండా అధికార పార్టీ వారికి మాత్రమే అందాయన్నారు. రానున్నది జగనన్న రాజ్యమని, అప్పుడు గ్రామాల్లో సమస్యలు పరిష్కరించేందుకు గ్రామంలోనే సిబ్బందిని ఏర్పాటు చేస్తారన్నారు. కార్యక్రమంలో కట్టా సింగయ్య, కట్టా గోపి, భీమేష్, తలతోటి అజయ్‌బాబు, బొచ్చు వెంకటరావు, పసుమర్తి శ్రీను, బొచ్చు కోటయ్య, యడవల్లి సాంబయ్య, రావులపల్లి నాగేశ్వరావు, రాయపాటి అంకయ్య, పల్లా అనురాధ, పి.ప్రభావతి, జల్లి సుబ్బులు, పులిచర్ల కృష్ణారెడ్డి, పిచ్చయ్య, సుబ్బారెడ్డి, రామకృష్ణ, వినోద్‌ పాల్గొన్నారు.

అనంతరం టీడీపీకి చెందిన 20 మందికి బాలినేని పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముక్తినూతలపాడు, గుత్తికొండవారిపాలెం గ్రామాల్లో జరిగిన రోడ్‌షోలో బాలినేని మాట్లాడుతూ తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఐదేళ్లు ప్రజా సంక్షేమాన్ని మరిచిన ప్రభుత్వం ఎన్నికలు రావడంతో పసుపు కుంకుమ, పింఛన్ల పెంపు అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. వాటిని నమ్మే స్థితిలో ప్రజలు లేరని, ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు.

బాలినేని, మాగుంటలను గెలిపించడండి
ఒంగోలు సిటీ: వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షుడు శింగరాజు వెంకట్రావు ఆధ్వర్యంలో గురువారం ఒంగోలు అసెంబ్లీ, పార్లమెంట్‌ అ«భ్యర్థులు బాలినేని శ్రీనివాసరెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డిలను గెలిపించాలని ప్రచారం చేశారు. 24వ డివిజన్‌లోని సమైక్యతానగర్, వంటపనివారల కాలనీ, బండ్లమిట్ట తదితర ప్రాంతాలో ప్రచారం చేశారు. కార్యక్రమంలో నాయకులు బేతంశెట్టి హరిబాబు, బేతంశెట్టి సిద్ధార్థ, గోవర్ధన్, తోట సత్యన్నారాయణ, వల్లెపు మురళి, దేవా, బాబి, అయ్యప్ప, బండారు శ్రీను పాల్గొన్నారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top