ఇకపై కౌలుదారీ ‘చుట్టం’

YSR Rythu Bharosa Applicable To Tenant Farmers - Sakshi

కొత్త బిల్లుతో మారనున్న బతుకులు

జిల్లాలో 3.50లక్షల మందికి లబ్ధి

ప్రభుత్వ రాయితీలన్నీ  వర్తింపు

కౌలు సేద్యం ఇక.. సంతోషాలను సుసాధ్యం చేయనుంది. సీఎం వైఎస్‌ జగన్‌ ఇచ్చిన భరోసా.. కౌలు రైతుల జీవితాల్లో వెలుగులు నింపనుంది. 

సాక్షి, ఏలూరు (పశ్చిమ గోదావరి): సెంటు భూమి లేకపోయినా భూమాతను నమ్ముకుని ఆరుగాలం శ్రమించే కౌలు రైతుకు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అండగా నిలిచింది. కౌలు రైతు కోసం ప్రత్యేక బిల్లు తీసుకొచ్చింది. భూ యజమానులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా కేవలం పండించే పంటలకు హక్కు కల్పించేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు ప్రణాళికలు సిద్ధం చేసింది. దీంతో జిల్లాలో 3.50 లక్షల మంది కౌలు రైతుల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.

‘నేను విన్నాను.. నేనున్నాను’.. అంటూ ప్రజాసంకల్ప పాదయాత్రలో భరోసా కల్పించిన ప్రజానాయకుడు ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులకే కౌలు రైతుల కోసం విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. నవరత్నాల్లో భాగంగా ప్రకటించిన ‘వైఎస్సార్‌ రైతు భరోసా’ను కౌలు రైతులకూ వర్తింపజేయాలన్న ప్రతిపాదనకు గత గురువారం క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది. సోమవారం బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీంతో కౌలు రైతుల మోముల్లో ఆనందం వెల్లివిరిసింది. ప్రభుత్వం అన్నదాతలకు కల్పించే రాయితీలన్నీ కౌలు రైతులకు కల్పించింది.

దీంతో కౌలు రైతులు 11 నెలలపాటు చెల్లుబాటు అయ్యేలా భూ యజమానులతో సాగు ఒప్పంద పత్రాలు రాసుకునేందుకు వీలు కలుగుతుంది. భూ యజమానులు, కౌలు రైతులు పరస్పర అంగీకారంతో చేసుకునే ఒప్పందాలు రాతపూర్వకంగా ఉంటాయి. భూ యజమానులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా కౌలు రైతులకు ఊరట కల్పించే బిల్లును రూపొందించారు. ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయంతో కౌలు రైతులూ పంట రుణాలు తీసుకునేందుకు అర్హులవుతారు. అలాగే ఇన్‌పుట్‌ సబ్సిడీతో పాటు వ్యవసాయశాఖ అందించే ఇతర రాయితీలన్నీ కౌలు రైతులకూ వర్తిస్తాయి.

జిల్లాలో ఇలా.. 

మొత్తం కౌలు రైతులు 3.50 లక్షలు
సాగు చేసే భూమి విస్తీర్ణం 7లక్షల ఎకరాలు
ఎల్‌ఈసీ కార్డులు పొందిన వారు 2.20 లక్షలు
భూములే లేని కౌలు రైతులు 1.50 లక్షలు
2019–20లో  కౌలురైతు రుణ ప్రణాళిక లక్ష్యం రూ.2 వేల కోట్లు

అందరికీ వైఎస్సార్‌ రైతు భరోసా..
జిల్లాలో ఉన్న కౌలు రైతులందరికీ అక్టోబరు నెల నుంచి వైఎస్సార్‌ రైతు భరోసా కింద అందించే పెట్టుబడి సాయంగా రూ.12,500 అందించనున్నారు. ఇది వరకూ పంటలు సాగు చేసుకునేందుకు బయట వ్యక్తుల నుంచి అప్పులు తీసుకుని సాగు చేసుకునేవారు. ప్రకృతి వైపరీత్యాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల పంటలు నష్టపోతే పెట్టిన పెట్టుబడి కూడా గిట్టుబాటు కాని దుస్థితి ఉండేది. దీంతో పంట చేతికిరాగా, మరోవైపు తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక తీవ్ర మనోవేదనకు గురయ్యేవారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వ్యవసాయం దండగ కాదు పండగలా చేయాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారు.

ఉచిత పంటల బీమా 
పంటలు సాగు చేసిన తర్వాత వర్షాభావం, ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ పంటలు కోల్పోతే రైతులు తీవ్రంగా నష్టపోయేవారు. పంటలకు బీమా చేసినా ప్రైవేటు బీమా సంస్థల నిబంధనల వల్ల పరిహారం అనుకున్నంత మేరకు వచ్చేది కాదు. దీనికితోడు ఈ ఖరీఫ్‌ సీజన్‌లో పంట నష్టపోతే వచ్చే ఖరీఫ్‌కు కూడా పరిహారం రైతు చేతికి అందడం లేదు. దీనికితోడు మిర్చి, పత్తి, వరి పంటలకు బీమా ప్రీమియం అధికంగా ఉండటంతో చాలా మంది బీమా చేయించుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. కౌలు రైతులకు అసలు బీమానే వర్తించేది కాదు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క రైతుకూ బీమా సదుపాయాన్ని కల్పిస్తామని, ఆ బీమా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇవ్వడంతో రైతుల మోముల్లో చిరునవ్వు వెల్లివిరుస్తోంది.

బీమా సొమ్ము చెల్లించడం చరిత్రే
రైతులు, ముఖ్యంగా కౌలురైతులు బీమా విషయాన్ని పట్టించుకోరు. కానీ ప్రభుత్వం వారి కోసం ఆలోచించి బీమా ప్రీమియం కూడా చెల్లించేందుకు ముందుకు రావడం చరిత్రలో లేదు. ఏ ప్రభుత్వమూ కౌలురైతు కోసం ఆలోచించిన పాపాన పోలేదు. ప్రస్తుత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. 
– సి.హెచ్‌.సంజీవరావు, కౌలురైతు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top