వైఎస్‌.. ఒయాసిస్సై..దాహం తీర్చారు

YSR  Drinking Water Scheme In Amalapuram - Sakshi

నియోజకవర్గంపై డాక్టర్‌ వైఎస్సార్‌ ముద్ర

బోడసకుర్రు–పాశర్లపూడి మధ్య వైనతేయపై వారధి నిర్మాణం

మున్సిపాలిటీ సహా 3 మండలాల్లో రూ.65 కోట్లతో తాగునీటి ప్రాజెక్టులు

సాక్షి, అమలాపురం టౌన్‌ / అల్లవరం: ముఖ్యమంత్రిగా డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి రాష్ట్రానికి ప్రజారంజక పాలన అందించినప్పుడు అమలాపురం నియోజకవర్గం కూడా అనూహ్యమైన అభివృద్ధిని సాధించింది. 2004 నుంచి 2009 వరకూ సాగిన డాక్టర్‌ వైఎస్‌ పాలన ఈ నియోజకవర్గంలో కొన్ని శాశ్వతమైన ప్రజా ప్రయోజనాలతో జరిగిన నిర్మాణాలు నేటికీ నియోజకవర్గ ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తున్నాయి. వాస్తవానికి 2004 అసెంబ్లీ ఎన్నికల నాటి నియోజకవర్గానికి 2009లో జరిగిన పునర్విభజనలో గతంలోని అల్లవరం నియోజకవర్గం దాదాపు 80 శాతం అమలాపురంలో చేరింది.

దీంతో వైఎస్‌ హయాంలో ఆ రెండు నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధి అంతా పునర్విభజన తర్వాత ఏర్పడ్డ అమలాపురం నియోజకవర్గంలోకి రావడంతో రెండు నియోజకవర్గాల అభివృద్ధిని మూట కట్టుకున్నట్లయింది. 2004 ఎన్నికల్లో వైఎస్‌ ప్రభుత్వం అధికారానికి వచ్చాక అప్పటి అమలాపురం, అల్లవరం ఎమ్మెల్యేలు కుడుపూడి చిట్టబ్బాయి, గొల్లపల్లి సూర్యారావులు తమ తమ నియోజకవర్గాలకు అభివృద్ధిపరంగా నిధులను అడిగిందే తడవుగా ముఖ్యమంత్రిగా వైఎస్‌ నిధుల మంజూరు చేశారు.

2009లో జరిగిన ఎన్నికల్లో కూడా వైఎస్‌ మళ్లీ సీఎం కావడంతో, నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైన పినిపే విశ్వరూప్‌ను తాగునీటి సరఫరా మంత్రిని చేయడంతో తాగునీటి పథకాలకు కొదవ లేకుండా చేశారు. అమలాపురం నియోజకవర్గం మీదుగా ఉన్న 216 జాతీయ రహదారికి అడ్డుగా ఉన్న గోదావరిపై వైఎస్‌ వారధి నిర్మించి అటు రాజోలు దీవిని అనుసంధానం చేయడంతో అమలాపురంతో కలిపారు.

నియోజకవర్గంలో వైఎస్‌ అభివృద్ధి జాడలు నిత్యం కనిపిస్తూనే ఉంటోంది. ఆయన ముద్ర నియోజకవర్గంపై శాశ్వతమై ఉంది. ఆ మహానేత హయాంలో జరిగిన అభివృద్ధి పనుల వారీగా ఓ సారి పరిశీలిస్తే అవి నేడు నియోజకవర్గ ప్రజలకు ఎంతలా ఉపయోగపడుతున్నా యో... ఎంతటి సేవలు అందిస్తున్నాయో అర్థమవుతుంది.

వారధి నిర్మించి చిరకాల వాంఛ తీర్చారు.

అది 2000 సంవత్సరం.. అప్పటి లోక్‌ సభ స్పీకర్‌ జీఎంసీ బాలయోగి కోనసీమ మీదుగా జిల్లాలోని కత్తిపూడి నుంచి కృష్ణా జిల్లా పామర్రు వరకూ దాదాపు 235 కిలో మీటర్ల రహదారికి జాతీయ రహదారి హోదా కల్పించారు. అయితే ఈ జాతీయ రహదారిలో కాకినాడ వైపు నుంచి కోనసీమ ముఖద్వారమైన యానాం–ఎదుర్లంక మధ్య ఉన్న గౌతమీ నదిపై వారిధి నిర్మించారు.

తర్వాత ఇదే జాతీయ రహదారిలో కోనసీమలో ఉన్న దిండి–చించినాడ మధ్య గల వశిష్ట నదిపై వారధి కూడా నిర్మితమైంది. అయితే కోనసీమలో ఇదే జాతీయ రహదారిపై అమలాపురం– పి.గన్నవరం నియోజకవర్గాలకు సంబంధించి బోడసకుర్రు–పాశర్లపూడి మధ్య ఉన్న వైనతేయ నదిపై వారధి నిర్మించలేదు. దీంతో జాతీయ రహదారి అనుసంధానం కాకపోవడంతో అమలాపురం ప్రాంతమే జాతీయ జీవన స్రవంతితో కలిసే పరిస్థితి లేకుండా పోయింది.

ఈ నదిపై వారధి నిర్మించాలన్న ఆ ప్రాంత ప్రజల చిరకాల వాంఛను డాక్టర్‌ వైఎస్సార్‌ గుర్తించారు. 2005లో ఈ వారిధికి రూ.76 కోట్లు విడుదల చేసి వైఎస్సే దాని నిర్మాణానికి పునాది రాయి వేశారు. 2009 నాటికి వారధి పూర్తయ్యి జాతీయ రహదారుల సేవలో అనుసంధానమైంది. 

పట్టణ ప్రజలకు భారీ సమ్మర్‌ స్టోరేజీ

అమలాపురం పట్టణంలో వైఎస్‌ ప్రభుత్వం రాక ముందు,  వాటర్‌ వర్క్స్‌ వద్ద రెండు తాగునీటి చెరువులు (రిజర్వాయర్లు), మూడు ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు ఉండేవి. వీటితోనే పట్టణ ప్రజల తాగునీటి అవసరాలు తీరాయి. వైఎస్‌ ముఖ్యమంత్రి అయ్యాక పట్టణ శివారులో 44 ఎకరాల్లో నిర్మించిన భారీ సమ్మర్‌ స్టోరేజీ రిజర్వాయర్‌ను అందుబాటులోకి తెచ్చారు.

2005లో వైఎస్సే ఈ భారీ తాగునీటి పథకాన్ని ప్రారంభించారు. గోదావరి జలాలు ప్రవహించే పంట కాల్వల నుంచి ఈ సమ్మర్‌ స్టోరేజీ రిజర్వాయర్‌కు నీటిని ముడి నీటిగా మళ్లించి పట్టణ ప్రజలకు 70 రోజుల పాటు నీటి నిల్వలు ఉండే సామర్థ్యంతో అందుబాటులోకి తెచ్చారు. ఈ రోజు పట్టణంలో పైపులైన్ల మరమ్మతులు, శివార్లు విస్తరించి జనాభా పెరిగిపోయి సరైన పర్యవేక్షణ లేక తాగునీటి చౌర్యం, వృధాను అరకట్టలేక పలు చోట్ల తాగునీటి సమస్యలు అనివార్యం చేశారు.

అయితే తాగునీటి వనరుల పరంగా నాటి భారీ సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ పట్టణ ప్రజల దాహార్తిని తీర్చే సామర్ధ్యం ఉన్నా పర్యవేక్షణ లోపంతో, అధికారుల వైఫల్యంతో నిరుపయోగంగా మారాయి. అప్పట్లో దాదాపు రూ.5 కోట్లతో ఆ తాగునీటి ప్రాజెక్టును నిర్మించారు.

3 మండలాలు...4 భారీ తాగునీటి ప్రాజెక్టులు..

డాక్టర్‌ వైఎస్‌ 2009లో మళ్లీ సీఎం అయ్యాక ఆయన మంత్రివర్గంలో ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్‌ గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ మంత్రి అయ్యారు. దీంతో నియోజకవర్గంలోని మండలాలకు దాదాపు 60 కోట్ల వ్యయంతో భీమనపల్లి, కూనవరం, చిందాడగరువు, బోడసకుర్రు గ్రామాల్లో నాలుగు ప్రాజెక్ట్‌లు ఏకకాలంలో నిర్మించారు. నియోజకవర్గంలోని 60 గ్రామాల్లో మూడొంతుల గ్రామాలు నదీ పరీవాహకం, సముద్ర తీరం వెంబడి ఉన్నాయి.

దీంతో ఇక్కడ భూగర్భ జలాల్లో ఉప్పు నీటి శాతం ఉండడంతో అవి దాహార్తి తీర్చవు. ఈ కారణంతోనే అప్పటి నియోజకవర్గ ఎమ్మెల్యే, సంబంధిత మంత్రి విశ్వరూప్‌ సీఎం వైఎస్‌తో చర్చించి మూడు మండలాలకు నాలుగు తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు ఆమోదముద్ర వేశారు. ఫలితంగా ఆ రోజు పట్టణంలోని 54 వేల మంది జనాభా, 60 గ్రామాల్లోని 2.30 లక్షల జనాభా దాహార్తి తీరుతోంది.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి వారధిగా నామకరణం చేయాలి
జాతీయ రహదారిలో అమలాపురం, పి.గన్నవరం నియోజకవర్గాలను కలుపుతూ నిర్మించిన బోడసకుర్రు వారధి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి వల్లే వచ్చింది. అందుకే ఆ వారధికి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని వల్ల అమలాపురం ప్రాంతానికి, రాజోలు దీవికి మధ్య దూరాభారం కూడా తగ్గింది. వైఎస్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాతే వారధి నిర్మాణం జరిగింది.

– దొమ్మేటి శివస్వామి, బోడసకుర్రు, అల్లవరం మండలం

స్వచ్ఛమైన నీరు తాగుతున్నాం
ఉప్పలగుప్తం మండలంలో రోజూ స్వచ్ఛమైన నీరు తాగుతున్నాం. గతంలో కలుషిత నీరును కాచుకుని తాగేవాళ్లం. భీమనపల్లి, కూనవరం గ్రామాల్లో నిర్మించిన తాగునీటి స్కీముల వల్ల ఇప్పుడు తాగునీటి సమస్యలే లేవు. అప్పట్లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి మా మండలానికి మంజూరు చేసిన రెండు తాగునీటి స్కీముల వల్లే ఈ రోజు మేమంతా మంచి నీరు తాగుతున్నాం. అప్పట్లో మా ఎమ్మెల్యే, మంత్రి విశ్వరూప్‌ ఈ స్కీములు మంజూరు చేసి మా ఇబ్బందులు తొలగించారు.      

– సూదా ఉమాపార్వతి, గృహిణి,వాడపర్రు, ఉప్పలగుప్తం మండలం


బోడసకుర్రు–పాశర్లపూడి మధ్య వైనతేయ నదిపై నిర్మించిన వారధి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top