ఆయనది చెరగని సంతకం

YS Rajashekar Reddy is an indelible signature For Farmers By Jalayagnam - Sakshi

స్వర్ణయుగం 

సాక్షి, మైలవరం :  ఆరోగ్యశ్రీతో ఉచితంగా వైద్యసాయం పొందిన పేదవాడి కుటుంబంలో ఆనందం.. డెల్టా ఆధునికీకరణతో అన్నదాత కళ్లలో వెలుగు.. పావలావడ్డీ రుణాలు పొందిన మహిళ మోములో చిరునవ్వు.. రీయింబర్స్‌మెంట్‌లో ఉచితంగా ఉన్నత విద్యాఫలాలు అందుకున్న విద్యార్థుల్లో నమ్మకం.. ఇవీ రాజన్న రాజ్యంలో చెరగని సంతకాలు. జిల్లావాసులు ఆ రోజులను గుర్తు చేసుకుంటున్నారు. సంక్షేమమే అజెండాగా అభివృద్ధి ఫలాలను అందజేసిన మహానేతను మననం చేసుకుంటున్నారు. చెప్పినవీ.. చెప్పనివి కూడా చేసి చూపించిన ఆ విశ్వసనీయతను తలచుకుంటున్నారు. ఆ రోజులు మళ్లీ రావాలని కోరుకుంటున్నారు.

సాగుకు భరోసా..
మైలవరం నియోజకవర్గంలోని రైతులకు సాగునీరందించడంతో పాటు తాగునీటి సమస్య పరిష్కారానికి వైఎస్సార్‌ శ్రీకారం చుట్టారు. అప్పటికే కృష్ణాజలాలు ఇబ్రహీంపట్నం నుంచి జి.కొండూరు వరకు అందించేందుకు గత ప్రభుత్వం మొదటి దశ పనులను పూర్తి చేసింది. కానీ మైలవరం, రెడ్డిగూడెం మండలాలకు కూడా తాగునీరు అందించాలనే లక్ష్యంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి రూ.5 కోట్లు కేటాయించి రెండోదశ పనులను పూర్తి చేశారు. కృష్ణావాటర్‌పైపులైను రెండోదశ పనులతో పాటు తారకరామ ఎత్తిపోతల రెండోదశ పనుల పూర్తి చేసి 2006 మే 10న ముఖ్యమంత్రి హోదాలో వైఎస్సార్‌ ప్రారంభించారు.

పోలవరం కాలువ మళ్లింపు
వెఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞం కార్యక్రమంలో భాగంగా పోలవరం కుడికాల్వ తవ్వకం చేస్తున్న సందర్భంలో కాలువకు చివరి భాగంలో ఉన్న వెలగలేరు గ్రామాన్ని అనుకొని తవ్వ వలసి ఉంది. అయితే కాలువను గ్రామానికి అనుకొని తవ్వడంతో గ్రామానికి ఒక వైపు బుడమేరు, రెండో వైపు పోలవరం కాల్వ ఉంటే వరదల వచ్చిన సమయంలో గ్రామం ముంపునకు గురవుతుందని అప్పటి నియోజకవర్గ ఎమ్మెల్యే చనమోలు వెంకట్రావు ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు.

చనమోలు అడిగిందే తడువుగా కాలువ రూట్‌మ్యాప్‌ను మార్చి వెలగలేరు గ్రామానికి తూర్పువైపుగా కాలువను తవ్వించి బుడమేరులో కలిపారు. వైఎస్సార్‌ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికీ మరవలేమని వెలగలేరు గ్రామ ప్రజలు అంటున్నారు.

తారకరామతో రైతులకు సాగనీరు 
మైలవరం నియోజకవర్గానికి తలమానికమైన తారకరామ ఎత్తిపోతల పథకం రెండోదశ పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరందించిన ఘనత దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డిది. తారకరామ ఎత్తపోతల పథకాన్ని నిర్మించడానికి అధికారులు మూడు దశలుగా విభజించారు.  మొదటి దశలో ఇబ్రహీంపట్నం,జి కొండూరు, విజయవాడరూరల్‌ మండలాల పరిధిలోని 12,556 ఎకరాలకు నీరందించడం లక్ష్యం. మొదటి దశ పనులు అప్పటి మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే,వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాదీశ్వరరావు ఆధ్వర్యంలో  2004 నాటికి పూర్తయ్యాయి.

వెలగలేరు గ్రామానికి తూర్పువైపుగా దారిమళ్లించి తవ్వించిన పోలవరం కుడి కాల్వ 

రెండవ దశలో జి.కొండూరు మండలంలోని 8గ్రామాలకు చెందిన 4,242ఎకరాలకు నీరందించడం లక్ష్యం.దీనికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సారధ్యంలో 10–05–2006న  పనులు ప్రారంభించి 2009కల్లా పూర్తి చేసి రైతులకు సాగునీరందించారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణాంతరం రాజకీయాలలో సంచలన మార్పులు కారణంగా మూడో దశ పనులు నిలిచిపోయాయి.

రైతు బాంధవుడు వైఎస్సార్‌
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వల్లనే తారకరామా ఎత్తిపోతల పథకం రెండవదశ పనులు పూర్తయ్యాయి. దీంతో రైతులకు సాగునీరు అందింది. ఆయన బతికి ఉంటే మూడో దశ పనుల కూడా పూరై్త నియోజకవర్గం సస్యశ్యామలమయ్యేది. కృష్ణా జలాలను మైలవరానికి అందించిన ఘనత కూడా వైఎస్సార్‌దే.

వైఎస్సార్‌ హయాంలో రైతులకు సాగునీరు పుష్కలంగా అందింది. నాలుగున్నరేళ్లుగా రైతులు సాగునీరు లేక అల్లాడిపోతున్నారు. జలవనరులశాఖా మంత్రిగా ఉండి కూడా దేవినేని ఉమా తన సొంత నియోజకవర్గంలో ఉన్న తారకరామను నిర్వీర్యం చేశారు. కృష్ణా జలాలను అందించడంలో దేవినేని విఫలమయ్యారు.
-పామర్తి వెంకటనారాయణ, రైతు, కుంటముక్కల 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top