పరిశ్రమల్లో స్థానికులకే ఉపాధి

YS Jagan Says That Employment to locals in industries - Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటన 

75 శాతం రిజర్వేషన్లను అమలు చేయాల్సిందే 

పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం గల మానవ వనరులను తీర్చిదిద్దాలి 

ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒక స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌  

పరిశ్రమల ఏర్పాటు కోసం ఇచ్చిన హామీలను తప్పనిసరిగా అమలు చేయాలి 

కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి సారించండి

పరిశ్రమల శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష    

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకు ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. ఈ నిబంధన కట్టుదిట్టంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా రాష్ట్రంలో 75 శాతం స్థానిక రిజర్వేషన్లను అమలు చేసే వాతావరణం కల్పించాలని చెప్పారు. పరిశ్రమల రంగంపై మంగళవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో కలిసి సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నైపుణ్యం కలిగిన మానవ నవరులను తీర్చిదిద్దడానికి ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఒక ఇంజనీరింగ్‌ కాలేజీని ఎంపిక చేసి, అక్కడ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందుకోసం త్వరితగతిన 25 ఇంజనీరింగ్‌ కళాశాలలను ఎంపిక చేయాలన్నారు. పారిశ్రామిక వర్గాలకు మానవ వనరుల కొరత తలెత్తకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. 

గ్లోబల్‌ టెండర్లతో తక్కువ ఖర్చుతో ప్రాజెక్టులు 
రాష్ట్రంలో అమలు చేస్తున్న అత్యున్నత పారిశ్రామిక విధానాలను పారిశ్రామిక వర్గాలకు తెలియజేయాలని సీఎం ఆదేశించారు. భారీగా పెట్టుబడులను ఆకర్షించేలా కొత్త విధానానికి రూపకల్పన చేయాలని చెప్పారు. ముఖ్యంగా నౌకాశ్రయాలు, ఎయిర్‌పోర్టులు, మెట్రో రైల్, ఎలక్ట్రికల్‌ బస్సులు వంటి బీవోటీ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా గ్లోబల్‌ టెండర్లు పిలవడం ద్వారా తక్కువ ఖర్చుతో ఈ సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా చూడాలన్నారు. రాయలసీమ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే కడప ఉక్కు కర్మాగారం నిర్మాణంపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి కోరారు. 

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ ర్యాంకులు ఎలా వచ్చాయో? 
గత తెలుగుదేశం ప్రభుత్వం పరిశ్రమలను కూడా మోసం చేసిందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రాయితీలు ఇస్తాం.. పెట్టుబడులు పెట్టండి అని చెబుతూ దేశ విదేశాలు తిరిగి ప్రచారం చేసిన గత ప్రభుత్వం చివరకు మొండిచేయి చూపిందన్నారు. 2015–16 నుంచి రూ.2,000 కోట్ల  మేర పారిశ్రామిక రాయితీలు బకాయిలు ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడులు పెట్టమని ఏ ముఖం పెట్టుకొని అడుగుతామని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ మొత్తంలో పారిశ్రామిక బకాయిలున్నప్పటికీ టీడీపీ ప్రభుత్వానికి ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకులు ఎలా వచ్చాయో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా పరిశ్రమల ఏర్పాటు కోసం ఇచ్చిన హామీలను తప్పనిసరిగా అమలు చేయాలని తేల్చిచెప్పారు. మున్సిపాల్టీలు, రిజిస్ట్రేషన్ల కార్యాలయాల్లో అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌ను వాడటం ద్వారా పారదర్శకంగా సేవలు అందించాలన్నారు. రెండు రూపాయలకే 20 లీటర్ల రక్షిత నీరు ఇస్తామని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టి అమలు చేయలేదన్నారు. ఇజ్రాయెల్‌లో రూపాయికే 25 లీటర్ల తాగునీరు ఇస్తున్నారని వివరించారు. ఆ దేశంలో సముద్రపు నీటిని డీశాలినేషన్‌ విధానంలో మంచినీటిగా మార్చి, ప్రజలకు సరఫరా చేస్తున్నారని తెలిపారు. 

ఆర్టీసీ లాభదాయక సంస్థగా మారాలి 
నష్టాల్లో ఉన్న ఆర్టీసీ లాభదాయక సంస్థగా మారేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేస్తున్నామని అన్నారు. భారీ సంఖ్యలో ఎలక్ట్రికల్‌ బస్సులను ప్రవేశపెట్టడం ద్వారా డీజిల్‌ భారాన్ని తగ్గించుకోవాలని చెప్పారు. బకింగ్‌హాం కెనాల్‌ను పునరుద్ధరించడం ద్వారా చౌకైన జలరవాణా వ్యవస్థను తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు.  

పంట ఉన్నచోటే ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ 
ఏ నియోజకవర్గంలో ఏయే పంటలు పండుతున్నాయో అక్కడే ఆయా పంటల ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. రాష్ట్రంలో ఆక్వా సాగు అవుతున్న ప్రాంతాలను గుర్తించి నకిలీ సీడ్, దాణా రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. 

కాలుష్యంపై కఠిన వైఖరి 
పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యాన్ని అరికట్టాలని, ఈ విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలని సీఎం ఆదేశించారు. పరిశ్రమల వల్ల పర్యావరణానికి నష్టం కలగడానికి వీల్లేదన్నారు. పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడానికి ముందే అన్ని విషయాలు తెలుసుకోవాలన్నారు. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు(పీసీబీ) ఆమోదించిన తర్వాతే పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని స్పష్టం చేశారు. పీసీబీని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దాలన్నారు. కాలుష్యాన్ని నియంత్రించే విషయంలో కఠినంగా లేకపోతే భవిష్యత్తు తరాలకు చాలా ఇబ్బందులు వస్తాయని సీఎం వైఎస్‌ జగన్‌ గుర్తుచేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top