శ్రీవారిని దర్శించుకోనున్న వైఎస్‌ జగన్‌

YS Jagan Mohan Reddy To Visit Tirumala Temple - Sakshi

ఇచ్ఛాపురంలో ముగియనున్న పాదయాత్ర

ఆ వెంటనే శ్రీవారిమెట్టు దారిన తిరుమలకు..

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన వెల్లడి

సాక్షి, తిరుపతి సెంట్రల్‌ : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చే నెల రెండో వారంలో తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి వెల్లడించారు. వైఎస్‌ జగన్‌ తిరుమల పర్యటన నేపథ్యంలో శుక్రవారం ఆ పార్టీ శ్రేణులతో భూమన సమావేశం నిర్వహించారు. వచ్చే నెల 8, లేదా 9వ తేదీ నాటికి ప్రజా సంకల్పయాత్ర ముగిసే అవకాశాలున్నాయన్నారు.

ప్రతిపక్ష నేత హోదాలో దివంగత వైఎస్సార్‌ ఇచ్ఛాపురంలో ప్రజా ప్రస్థానాన్ని ముగించిన తరహాలోనే.. వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్రను కూడా ఇచ్ఛాపురం బహిరంగ సభతో ముగిస్తారని చెప్పారు. అదే రోజే వైఎస్‌ జగన్‌ తిరుపతికి చేరుకుని విశ్రాంతి తీసుకుంటారని, ఆ మర్నాడు ఉదయమే అతిథి గృహం నుంచి కారులో బయలుదేరి అలిపిరికి చేరుకుంటారని తెలిపారు. శ్రీవారి మెట్టుదారిన తిరుమలకు నడిచి వెళ్లి, శ్రీవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకుంటారని కరుణాకరరెడ్డి వివరించారు. వైఎస్‌ జగన్‌ సుమారు 140 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 3,600 కిలోమీటర్ల మేరకు పాదయాత్రను కొనసాగించారని.. సుమారు 2.70 కోట్ల మంది ప్రజలను వైఎస్‌ జగన్‌ ప్రత్యక్షంగా కలుసుకున్నారన్నారు. చరిత్రలో ప్రజా సంకల్ప యాత్ర శాశ్వతంగా నిలిచిపోతుందని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top