ఉన్నత చదువులకు ప్రోత్సాహం | YS Jagan Mohan Reddy Comments in a meeting with the Expert Committee on Education Reform | Sakshi
Sakshi News home page

ఉన్నత చదువులకు ప్రోత్సాహం

Jul 6 2019 5:10 AM | Updated on Jul 11 2019 5:12 PM

YS Jagan Mohan Reddy Comments in a meeting with the Expert Committee on Education Reform - Sakshi

చదువుల్లో నాణ్యత పెరగాలి..
‘‘మన విద్యావ్యవస్థను తీర్చిదిద్దాలన్న నా కల సాకారం దిశగా అడుగులు వేస్తున్నా. దీనికి మీ అందరి సహకారం, ప్రోత్సాహం అవసరం. కేవలం సలహాల్లోనే కాకుండా అమల్లో కూడా విద్యారంగ సంస్కరణల నిపుణుల కమిటీ పాలుపంచుకోవాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి కమిటీ సమావేశం కావాలి. నేను కూడా నెలకు ఒకసారి నిపుణుల కమిటీ సమావేశంలో పాల్గొంటా. చదువుల్లో నాణ్యత పెంచడంపై కమిటీ దృష్టి పెట్టాలి’’
– విద్యారంగ సంస్కరణలపై నిపుణుల కమిటీతో భేటీలో సీఎం వైఎస్‌ జగన్‌

గొప్ప మార్పులకు నాంది
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకుంటున్న చర్యలు దేశ విద్యారంగంలో గొప్ప మార్పు తెస్తాయని విద్యారంగ నిపుణుల కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. విద్యారంగాన్ని ప్రేమించడం, దాని గురించి మాట్లాడటం చాలా కాలం క్రితమే ముఖ్యమంత్రులు మానుకున్నారని, అయితే భావితరాల భవిష్యత్తు కోసం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇంత భారీ ప్రయత్నం చేయడం అభినందనీయమన్నారు. ప్రైవేట్‌ విద్యాసంస్థల దోపిడీని అడ్డుకునేందుకు నియంత్రణ యంత్రాంగం ఉండాలన్నారు. ఇంగ్లీషు మాధ్యమం స్కూళ్ల ఆలోచన మంచిదేనన్నారు. 

సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్‌ అనంతరం ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు వసతి, భోజన ఖర్చుల కోసం ఏటా రూ.20 వేలు అందిస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ‘అమ్మ ఒడి’ మాదిరిగా ఈ మొత్తాన్ని కూడా విద్యార్థుల తల్లులకే అందిస్తామని తెలిపారు. విద్యారంగ సంస్కరణలపై నియమించిన నిపుణుల కమిటీతో శుక్రవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘పేదల జీవితాలు మారాలంటే చదువు ఒక్కటే మార్గం. ఉన్నత విద్య అభ్యసించే అవకాశం లేక చాలా మంది చదువులు మానేస్తున్న దుస్థితి నెలకొంది. దీన్ని పూర్తిగా నివారించాలి. చదువు విద్యార్థికి ఉపాధి కల్పించాలి. డిగ్రీ తీసుకున్నాక ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉండాలి’ అని అభిప్రాయపడ్డారు. గ్రామీణ విద్యార్థులు రూ.లక్షల్లో ఫీజులు చెల్లించడం భారంగా మారిందని, అందుకే 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తున్నామని చెప్పారు. 

ఫీజుల నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థ
విద్య అనేది వ్యాపారం కాదని సేవగా భావించాలని సీఎం సూచించారు. స్కూళ్లు, కాలేజీల్లో ఫీజుల పర్యవేక్షణ, నియంత్రణ కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. దీనికోసం అసెంబ్లీలో చట్టాన్ని తెస్తామని చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని అసెంబ్లీలో చట్టం తెస్తామని వివరించారు. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఒక ఇంజనీరింగ్‌ కాలేజీని స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రంగా మార్చి ఆ ప్రాంతంలోని వారికి శిక్షణ ఇస్తామని తెలిపారు. ఈ కేంద్రం జిల్లాలోని పారిశ్రామికవర్గాలతో సంప్రదించి పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను విద్యార్ధులకు సమకూరుస్తుందని ముఖ్యమంత్రి వివరించారు. 

మాపై ప్రజల నమ్మకానికి నిదర్శనం..
వచ్చే ఏడాది జనవరి 26వతేదీ నుంచి ‘అమ్మ ఒడి’ పథకం అమల్లోకి వస్తుందని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశంలో తెలిపారు. అమ్మ ఒడి పథకం  ప్రైవేట్‌ పాఠశాలలకు కూడా వర్తిస్తుందని ప్రకటించినా చాలా మంది ప్రభుత్వ స్కూళ్లలోనే చేరడం శుభపరిణామమని సీఎం అభిప్రాయపడ్డారు. తమపై ప్రజలకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లనీయకుండా నిరుత్సాహపరిచిందన్నారు. ‘గత ప్రభుత్వ హయాంలో 6 నుంచి 8 నెలలు గడిచినా మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు సరుకుల బిల్లులు చెల్లించని పరిస్థితి ఉండేది. విద్యార్థులకు పుస్తకాలు సకాలంలో ఇవ్వలేదు. పాదయాత్రలో ఈ విషయాన్ని నా దృష్టికి తెచ్చారు’ అని సీఎం చెప్పారు. ప్రతి పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించి రెండు మూడేళ్ల తరువాత ఎంత మార్పు వచ్చిందో ఫొటోలు తీసి ప్రజలకు చూపిస్తామన్నారు.

సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, కమిటీ ఛైర్మన్, ఐఐఎస్‌సీ ప్రొఫెసర్‌ బాలకృష్ణన్, ఇన్ఫోసిస్‌ ఛైర్‌పర్సన్‌ సుధానారాయణమూర్తి, ఎన్‌ఐఈపీఏ మాజీ వీసీ ప్రొఫెసర్‌ జంధ్యాల బీజీ తిలక్, ఎన్‌ఐఈపీఏ ప్రొఫెసర్‌ నళినీ జునేజా, ఎంవీ ఫౌండేషన్‌ జాతీయ కన్వీనర్‌ ఆర్‌.వెంకటరెడ్డి, ఉన్నత విద్యామండలి మాజీ వీసీ ఎన్‌.రాజశేఖరరెడ్డి, సామాజికవేత్త బి.రామకృష్ణంరాజు, ఎస్‌ఆర్‌ఐటీ సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి, వికాస్‌ కేంద్ర గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రతినిధి బి.ఈశ్వరయ్య, ఓక్రిడ్జ్‌ మాజీ డైరెక్టర్‌ బి.వి.ఆర్‌.కె. ప్రసాద్, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్, కాలేజీ విద్య కమిషనర్‌ సుజాతా శర్మ, ఇంటర్‌ కార్యదర్శి కాంతిలాల్‌ దండే, పాఠశాల విద్య కమిషనర్‌ సంధ్యారాణి, ఉన్నత విద్యామండలి కార్యదర్శి వరదరాజన్‌ తదితరులు పాల్గొన్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్‌ అంతకుముందు కమిటీతో సచివాలయంలో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు.

తెలుగు తప్పనిసరి..
ప్రతి ప్రభుత్వ పాఠశాలను ఆంగ్ల మాధ్యమంగా మార్పు చేస్తున్నామని, ప్రస్తుతం ఉన్న టీచర్లకు ఇంగ్లీషు బోధించేలా శిక్షణ ఇస్తామని తెలిపారు. అయితే అదే సమయంలో తెలుగు భాషను తప్పనిసరి చేస్తున్నామని స్పష్టం చేశారు. స్కూళ్లలో ఇ–లెర్నింగ్‌ విధానాలను తీసుకురావాలని సీఎం సూచించారు. మధ్యాహ్న భోజన పథకం నాణ్యతను పెంచుతామని, ప్రస్తుతం ఇస్తున్న రేట్లు పెంచి నిధులు ఇస్తామన్నారు. ప్రతి విద్యార్థికి 3 జతల యూనిఫారాలు, ఒక జత బూట్లు పంపిణీ చేస్తామని, విద్యార్ధుల తల్లిదండ్రులకే దుస్తుల కుట్టు కూలీ ఛార్జీలు, షూలు, సాక్సుల కొనుగోలు డబ్బులు ఇస్తామని తెలిపారు. ‘పట్టణ ప్రాంతాల్లో మధ్యాహ్న భోజనం బాధ్యతలను మాత్రమే అక్షయపాత్రకు ఇస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడున్న డ్వాక్రా అక్కచెల్లెమ్మలకే అప్పగిస్తాం’ అని సీఎం స్పష్టం చేశారు. ప్రతి పాఠశాల అభివృద్ధి, పర్యవేక్షణ కోసం విద్యా కమిటీలను ఏర్పాటు చేస్తామని, రాజకీయాలకు అతీతంగా వీటిని ఏర్పాటు చేస్తామని, కమిటీలు క్రమం తప్పకుండా సమావేశమై స్కూలు బాగోగులను సమీక్షించాలన్నారు. హైస్కూళ్లను జూనియర్‌ కాలేజీలుగా కొనసాగించే అంశం సమావేశంలో ప్రస్తావనకు రావడంతో ఆ దిశగా ఆలోచన చేయాలని సీఎం సూచించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement