
సాక్షి, ఒంగోలు: ప్రకాశం జిల్లా ప్రజల దశాబ్దాల కల నెరవేర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. రామాయపట్నం పోర్టు ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసి, రామాయపట్నం పోర్టు ఏర్పాటు చేయాలంటూ కోరారు. జగన్ నిర్ణయం పట్ల జిల్లాలోని అన్ని వర్గాల ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అనుకున్న ప్రకారం రామాయపట్నం పోర్టు నిర్మాణం జరిగితే జిల్లా రూపురేఖలే మారనున్నాయి. జిల్లాలోని నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు మరింత మెరుగవుతాయి. వెనుకబడిన జిల్లాగా ఉన్న ప్రకాశం జిల్లాలో పోర్టు నిర్మాణం చేపట్టాలనే నిర్ణయం వల్ల జిల్లా అభివృద్ధికి రెడ్ కార్పెట్ పరిచినట్లేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ఎదురుచూస్తున్న జిల్లా ప్రజానీకానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం వరంగా మారింది.
బాబు హయాంలో మోసాలతో కాలక్షేపం..
గత ప్రభుత్వం ఐదేళ్లపాటు పోర్టు నిర్మాణంపై మోసం చేస్తూ వచ్చింది. 2014లో ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినప్పటి నుంచి చంద్రబాబు జిల్లా అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదు. కనీసం ఒక్క కొత్త ప్రాజెక్ట్ కూడా జిల్లాకు తీసుకురాని దుర్భర పరిస్థితి. రామాయపట్నం పోర్టు ఏర్పాటు కోసం జిల్లాకు చెందిన అనేక మంది ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టినా గత ప్రభుత్వం మాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎన్నికల ముందు మాత్రం ఓట్ల కోసం రామాయపట్నంలో మినీ పోర్టు ఏర్పాటు పేరుతో 2019 జనవరి 9వ తేదీన భూమిపూజ చేసి మరో మోసానికి తెరతీసిన వైనం అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుత సీఎం వై.ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేసి రెండు నెలల కూడా గడవకముందే రామాయపట్నం పోర్టు నిర్మాణం కోసం ప్రధాని మోదీని నేరుగా కలిసి కోరడంపై జిల్లా ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
రామాయపట్నం పోర్టుకు అనువు..
పోర్టు నిర్మాణానికి రామాయపట్నం అనుకూలంగా ఉంటుందని 2012 ఆగస్టు 22వ తేదీన కేంద్ర నౌకాయాన మంత్రిత్వశాఖ స్టేక్‌హోల్డర్స్‌తో సమావేశం నిర్వహించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ తరువాత 2012 సెప్టెంబర్ 2న అప్పటి ప్రభుత్వం రామాయపట్నం ప్రాంతం ఓడరేవు, నౌకా నిర్మాణ కేంద్రానికి అణువైనదని పేర్కొంటూ కేంద్రానికి లేఖ రాసింది. 2013 ఏప్రిల్ 15న కేబినెట్ కమిటీకి కేంద్ర నౌకాయాన మంత్రిత్వశాఖ ఒక నోట్ సమర్పించింది. ఆ నోట్ ద్వారా రామాయపట్నం అనుకూల ప్రదేశమని ఆర్ధిక, రక్షణ, హోమ్, రవాణా, రైల్వే మంత్రిత్వ శాఖలకు సమాచారం అందించారు. క్యాబినెట్ కమిటీకి రాష్ట్ర విభజన చట్టంలో నెల్లూరు జిల్లా దుగరాజపట్నం పోర్టు నిర్మాణం చేపట్టాలని పొందుపర్చిన విషయం తెలిసిందే.
ఆ తరువాత అనూహ్యంగా దుగరాజపట్నం పోర్టు ఏర్పాటు తెరపైకి వచ్చింది. రాష్ట్ర విభజన జరిగే సమయంలోనూ దుగరాజపట్నం పోర్టు ఏర్పాటు అంశం విభజన చట్టంలో చేర్చారు. దీంతో అప్పటి నుంచి జిల్లాలో రామాయపట్నం పోర్టు ఏర్పాటు కోరుతూ ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి.ప్రకాశం జిల్లా ప్రజల ఆశలు చిగురించేలా మంగళవారం సీఎం జగన్ రామాయపట్నం పోర్టు ఏర్పాటు అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వద్ద ప్రస్తావించారు. దీంతో జిల్లాలోని అన్ని వర్గాల ప్రజల్లో ఆనందోత్సాహాల్లో ఉన్నారు. దశాబ్దాల కల నెరవేరుతుందనే ఆశలు సజీవంగా ఉన్నాయి.
జిల్లా అభివృద్ధి జగన్‌కే సాధ్యం
జిల్లా అభివృద్ధి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి వలనే సాధ్యమనే విషయం మరోసారి రుజువైంది. రామాయపట్నం పోర్టు నిర్మించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీని కోరడం ద్వారా జిల్లాపై ఆయనకున్న ప్రేమ అర్ధమవుతుంది. జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జిల్లాలో పాదయాత్ర చేస్తున్నప్పుడు పోర్టు సాధన సమితి ఆయన్ను కలిసి పోర్టు నిర్మాణ విషయాన్ని వివరించాం. అప్పట్లో పోర్టు విషయంలో సానుకూలంగా స్పందించారు. అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడవకముందే పోర్టు నిర్మాణంపై దృష్టి సారించడం హర్షణీయం.
– మారెడ్డి సుబ్బారెడ్డి, వైఎస్సార్‌సీపీ రైతు విబాగం జిల్లా అధ్యక్షుడు