చట్టం వారికి చుట్టం..!

YS Avinash Reddy  Fair On Kadapa Police Kadapa - Sakshi

ప్రభుత్వ నిబంధనలు, కోర్టు ఉత్తర్వులకు లోబడి క్లబ్‌ల నిర్వహణ

మంగతాయ్‌ ఆడుతున్నట్లుగా కేసు నమోదు

అధికార పార్టీ నాయకుని నిర్వహణలోని క్లబ్‌పై కన్నెత్తి చూడని యంత్రాంగం

పోలీసుల ఏకపక్ష వైఖరిని ప్రశ్నించిన మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి

పులివెందుల : పులివెందుల పట్టణంలో స్థానిక రీడింగ్‌రూమ్‌ వీధిలో ఉన్న సరస్వతి విలాస మందిరం, డిగ్రీ కళాశాల రోడ్డులోని వైఎంసీ క్లబ్‌ పేరిట రెండు పేకాట క్లబ్‌లు ఉన్నాయి. ఈ క్లబ్‌లు గత 50ఏళ్లకు పైగా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి, హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా ఇక్కడ (స్కిల్‌గేమ్‌) పేకాట ఆడుతున్నారు. ఆదివారం సీఐ పుల్లయ్య ఈ రెండు క్లబ్‌లపై దాడులు నిర్వహించారు. చట్టాన్ని ధిక్కరించి పేకాట ఆడుతుంటే పోలీసుల చర్యలను ఏమాత్రం తప్పుబట్టాల్సిన పనిలేదు. కాకపోతే నిబంధనలకు అనుగుణంగా పేకాట ఆడుతున్న వారితోపాటు, వివిధ పనుల కోసం అక్కడికి వచ్చిన వారందర్నీ అదుపులోకి తీసుకున్నారు. అందరిపై మంగతాయ్‌ జూదం ఆడుతున్నట్లుగా కేసు నమోదు చేయడం ఆశ్చర్యం కల్గిస్తున్న అంశం.

అటువైపు కన్నెత్తి చూడని యంత్రాంగం... 
పులివెందుల పట్టణంలోని ముద్దనూరు రోడ్డులో టీడీపీ నాయకుని కనుసన్నల్లో ఓ క్లబ్‌ నడుస్తోంది. పోలీసులకు పేకాట నియంత్రించాలన్న చిత్తశుద్ధి ఉన్నప్పుడు ఏకకాలంలో మూడు క్లబ్‌లపై దాడులు చేసి, చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే చర్యలు చేపట్టాల్సి ఉంది. కాగా టీడీపీ నేత ఆధ్యర్యంలో నిర్వహిస్తున్న క్లబ్‌వైపు కన్నెత్తి చూడలేదు. పైగా అక్కడ క్లబ్‌ నిర్వహిస్తున్నట్లు..అందులో జూదం ఆడుతున్నట్లు తమకు ఫిర్యాదు లేదని సీఐ చెప్పడం గమనార్హం. దాదాపు రెండు నెలలుగా టీడీపీ నేత ఆధ్యర్యంలో క్లబ్‌ యథేచ్ఛగా జరుగుతోంది. చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులు అధికార పార్టీ నాయకులపై స్వామి భక్తిని చాటుకున్నారు.

కేవలం రెండింటిపై దాడులు నిర్వహించి అధికార పార్టీ నాయకునికి చెందిన క్లబ్‌పై ఎలాంటి దాడులు చేయలేదు. రెండు క్లబ్‌లలో నిబంధనలకు లోబడి పేకాట ఆడుతున్నా దాదాపు 120మందిని అరెస్టు చేసి క్లబ్‌లో వీరు మంగతాయ్‌ జూదం ఆడుతున్నట్లు అక్రమ కేసు బనాయించారు. వారి వద్ద ఉన్న డబ్బులు, సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. విలేకరులు సీఐ పుల్లయ్యను మూడో క్లబ్‌మీద ఎందుకు దాడి చేయలేదని వివరణ కోరగా పట్టణంలో మూడో క్లబ్‌ నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి రాలేదని సమాధానం ఇచ్చారు. అలాంటివి ఏవైనా ఉంటే దాడులు చేపడతామని చెప్పడం కొసమెరుపు. 

పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు  
పులివెందుల పోలీసులు అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని కడప మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం క్లబ్‌లపై దాడిచేసిన విషయం తెలుసుకున్న వైఎస్‌ అవినాష్‌రెడ్డి స్థానిక అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ ఉన్నవారు తాము నిబంధనలకు లోబడి పేకాట ఆడుతున్నా అరెస్టు చేశారని..అలాగే పేకాట ఆడకుండా క్లబ్‌కు ఇతర పనులమీద వచ్చిన వారిని కూడా అన్యాయంగా అరెస్టు చేశారని ఆయన దృష్టికి తెచ్చారు.

దీంతో అవినాష్‌రెడ్డి సీఐ పుల్లయ్యతో మాట్లాడుతూ కేవలం రెండు క్లబ్‌లపై దాడిచేసి మూడోదానిపై ఎందుకు దాడిచేయలేదని ప్రశ్నించారు. ఆ క్లబ్‌ అధికార పార్టీ నాయకునికి సంబంధించింది కనుక దాడులు చేయలేదన్నారు. అందుకు సీఐ పుల్లయ్య అక్కడ క్లబ్‌ నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి రాలేదన్నారు. పులివెందులలో టీడీపీ నాయకునికి సంబంధించిన క్లబ్‌ గురించి పోలీసులు తమకు తెలియదని చెప్పడం ఎంతవరకు సమంజసమని ఆయన సీఐతో వాగ్వాదానికి దిగారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top