దిగరా నాయనా.. నీ ‘పెళ్లి’ తప్పక చేస్తాం..!!

Young Man Climbs Cell Tower for Wedding In Chittoor - Sakshi

సాక్షి, చిత్తూరు : తాను ఇష్ట పడ్డ అమ్మాయితో వివాహం చేయాలని లేనిపక్షంలో దూకేస్తానంటూ ఓ భగ్న ప్రేమికుడు సెల్‌టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేశాడు. అంతే..! ట్రాఫిక్‌ జామ్‌..సెల్‌ కెమెరాలు టవర్‌ వైపు జూమ్‌..సామాజిక మాధ్యమాల్లో లైవ్‌..ఇతగాడు దిగతాడా? దూకేస్తాడా? అనే చర్చ. దిగరా నాయనా..అంటూ తల్లి, అమ్మమ్మ సెల్‌ఫోన్‌లో పదే పదే కోరుతున్నా ‘పెళ్లి చేస్తేనే’ అంటూ అక్కడే భీష్మించుకున్నాడు.  ఈ ప్రేమికుడి యవ్వారం పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి చిర్రెత్తించింది. మధ్యలో పూతలపట్టు ఎమ్మెల్యే కూడా రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. మొత్తానికి అందరికీ చుక్కలు చూపిన అతగాడిని ఎట్టకేలకు కిందకు దించగలిగారు. ఇక అతడికి తమదైన ‘పెళ్లి’ చేసే పనిలో పోలీసులు పడ్డారు.

ఇక మేటర్‌లోకి వెళితే...
స్థానిక వళ్లియప్పనగర్‌కు చెందిన సంపత్‌కుమార్‌ (25) ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తూ మానేశాడు. ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తన ఆటోలో వస్తూన్న తవణంపల్లె మండలానికి చెందిన యువతితో ప్రేమలో పడ్డాడు. కులాలు వేరుకావడంతో ఆ యువతితో పెళ్లికి సంపత్‌కుమార్‌ కుటుంబ సభ్యులు అంగీకరించలేదట! దీంతో మనస్తాపం చెందిన ఆ వీర ప్రేమికుడు ఓటీకే రోడ్డులో ఉన్న సెల్‌ టవర్‌ ఎక్కాడు. మేటరేమిటో తెలిశాక జనం చిన్నపాటి జాతర లెవెల్లో అక్కడికి చేరుకున్నారు. ట్రాఫిక్‌ కూడా స్తంభించింది. అత్యుత్సాహవంతులు సెల్‌ కెమెరాలో దీనిని చిత్రీకరించి వైరల్‌ చేశారు.

పోలీసులకూ సమాచారం అందడంతో  టూటౌన్‌ సీఐ యుగంధర్, వన్‌ టౌన్‌ ఎస్‌ఐ మనోహర్‌ అక్కడికి చేరుకున్నారు. సెల్‌టవర్‌ నుంచి అతగాడు కిందకు విసిరేసిన చీటీలో తన ప్రేమ యవ్వారం గురించి ప్రస్తావించడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. ఎంతనచ్చచెప్పినా అతగాడు దిగలేదు. చివరకు అగ్నిమాపక సిబ్బంది సైతం రంగంలోకి దిగి సెల్‌ టవర్‌ చుట్టూ వలలు ఏర్పాటు చేశారు. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు వచ్చి తనకు న్యాయం చేయాలని సంపత్‌ పట్టుబట్టడంతో సమాచా రాన్ని ఆయనకు చేరవేశారు. ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్‌కు చెందిన అమ్మాయి కావడంతో ఆయనే వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి తనకు న్యాయం చేయాలంటూ కోరాడు. చివరకు ఎంఎస్‌ బాబు అక్కడికి రాక తప్పలేదు. సెల్‌ఫోన్‌లో ఆయన సంపత్‌తో మాట్లాడి నచ్చచెప్పారు.

దీంతో అతగాడు సెల్‌టవర్‌ దిగాడు. దీంతో గంటన్నర పాటు ఉత్కంఠకు తెరపడింది. అతడు ఇష్టపడిన అమ్మాయి మైనరని, ఆ అమ్మాయి అతగాడినేమీ ఇష్ట పడటం లేదని, ఇతడిదో వన్‌ సైడ్‌ లవ్‌ అని తెలిసింది. పోలీసులు కూడా దీనిని సీరియస్‌గా తీసుకున్నారు. అతడిపై కేసు నమోదుకు రెడీ అవుతున్నారు. ఎవరైనా సెల్‌ టవర్‌ ఎక్కి ఇలాంటి పనులకు పూనుకుంటే ఉపేక్షించేది లేదని సీఐ తీవ్రంగా హెచ్చరించారు. పోలీసుల ట్రీట్‌మెంట్‌తో అతగాడి ప్రేమ మైకం దిగుతుందో, లేదో మరి! 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top