కోర్టు కష్టాలు

Yerragondapalem Have No Court  - Sakshi

సాక్షి, యర్రగొండపాలెం(ప్రకాశం): యర్రగొండపాలెంలో కోర్టు లేకపోవడంతో కక్షిదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. వారితో పాటు పోలీసులు కూడా అనేక వ్యయప్రయాసలకోర్చి నిందితులను సుదూర ప్రాంతమైన మార్కాపురం కోర్టులో హాజరుపరిచే పరిస్థితి ఏర్పడింది. పుల్లలచెరువు మండలంలోని మర్రివేముల గ్రామం నుంచి మార్కాపురం కోర్టు దాదాపు 70 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. అదేవిధంగా నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో ఉన్న శివారుగ్రామాలను దూరప్రాతిపదిక కింద చూసుకుంటే దాదాపు 110కిలోమీటర్ల దూరం ఉంటుంది. నియోజకవర్గంలో అన్ని కేసులు కలుపుకొని 700 వరకు ఉన్నాయి. వీటిలో ఎక్కువగా పుల్లలచెరువు, త్రిపురాంతకం మండలాల్లో  ఉన్నాయి. దీంతో వాయిదాలకు బస్సుల్లో వెళ్లే వారు కోర్టుకు సకాలంలో హాజరుకాలేక పోతున్నారు.

అంతేకాకుండా సాయంత్రం వరకు కోర్టు ఆవరణలోనే కేసు వాయిదా పడిన తరువాత తిరిగి తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు బాధితులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఉంది. ప్రత్యర్థి వర్గం వారు రాత్రివేళల్లో ఎక్కడ దాడులు జరుపుతారో అన్న భయంతో అనేకమంది మార్కాపురంలోనే బసచేస్తున్నారు. దీనివలన కక్షిదారులు ఎక్కువగా ఖర్చుపెట్టు పెట్టుకోవాల్సి వస్తుంది. జిల్లాలోనే పూర్తిగా వెనకబడిన యర్రగొండపాలెం నియోజకవర్గం గిరిజన ప్రాంతం. గిరిజనులతో పాటు పేదలు ఎక్కువగా ఉండేఈ ప్రాంతంలో కేసులు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. వీరు ఖర్చుపెట్టుకొని మార్కాపురం వెళ్లటానికి అప్పులు చేస్తుంటారు. 

రెట్టింపయిన జనాభా..
గతంలో మార్కాపురం తాలూకాలో యర్రగొండపాలెం ఒక భాగం. అప్పట్లో ఈ ప్రాంతం డిప్యూటీ తహసీల్దార్‌ పాలనలో ఉండేది. భూములకు సంబంధించిన కేసులను పరిష్కరించేందుకు రెవెన్యూ కోర్టు ఉండేది. ప్రస్తుతం రెవెన్యూ కార్యాలయం ఆవరణలో ఉన్న రేకుల షెడ్డులో కోర్టు నడిచేది. తదనంతరం వైపాలెం నియోజకవర్గంగా ఏర్పడింది. తహసీల్దార్‌ స్థాయికి ఎదిగింది. జనాభాకూడా రెట్టింపయింది. తదనుగుణంగా కేసులు కూడా పెరుగుతు వచ్చాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని యర్రగొండపాలెంలో కోర్టును ఏర్పాటు చేయాలని ఈ ప్రాంతం ప్రజలు కోరుతున్నారు.

కోర్టు కోసం అర్జీలు పెట్టాం
కోర్టు కావాలని అనేక పర్యాయాలు అర్జీలు పెట్టాం. ఈ ప్రాంతంలో ఎక్కువగా కేసులు ఉన్నాయి.  కక్షిదారులు కోర్టుకు హాజరుకావటానికి వ్యయప్రయాసాలకోర్చి మార్కాపురం వెళ్లాల్సి వస్తోంది. బాధితులు కోర్టు వాయిదా అయిపోయిన తరువాత తమ గ్రామాలకు వెళ్లటానికి బస్సులులేక అక్కడే బసచేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వైపాలెంలో కోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. 
– టీసీహెచ్‌ చెన్నయ్య, సీపీఐ సీనియర్‌ నాయకుడు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top