మమేకం

మమేకం - Sakshi


సాక్షి, పులివెందుల :  ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి పులివెందులకు వచ్చిన వైఎస్ జగన్ ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మాట్లాడారు. కార్యకర్తలు, నాయకులలో నిస్తేజాన్ని తొలగించి నూతనోత్సాహాన్ని నింపారు. పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరాయంగా ప్రజలతో మమేకమయ్యారు. నేనున్నానంటూ అందరికీ భరోసా నింపారు. ప్రతి ఒక్కరినీ దగ్గరకు తీసుకుని కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. వైఎస్ జగన్‌ను చూడగానే పులివెందుల ప్రజలు ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.

 

 చమర్చిన కళ్లతో మాట్లాడుతున్న కార్యకర్తలు, అభిమానులను చూసి జగన్ చలించిపోయారు. కష్టపడ్డాం... ఫలితం దక్కలేదు. దేవుడు త్వరలోనే మంచి రోజులను ప్రసాదిస్తారంటూ వైఎస్ జగన్ కార్యకర్తలలో ధైర్యం నింపారు. సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యతను కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి అప్పగిస్తూ ప్రతిఒక్కరినీ పలకరించారు.

 

 ఆర్యవైశ్యుల సత్కారం  

 పులివెందులకు చెందిన ఆర్యవైశ్య సంఘ నాయకులు మిట్టా విశ్వనాథం, విజయ్‌కుమార్, పట్టాభి, రవికుమార్ ఆధ్వర్యంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బొకేలను అందించి అభినందించిన అనంతరం శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం పొట్టిశ్రీరాములు బొమ్మతో కూడిన జ్ఞాపికను అందజేశారు. అలాగే కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి కూడా శాలువా కప్పి సన్మానించిన ఆర్యవైశ్య సంఘ నాయకులు ప్రత్యేక జ్ఞాపికను కూడా అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్, అవినాష్‌లు ఆర్యవైశ్యుల సమస్యలపై చర్చించారు.

 

 వైఎస్ జగన్‌ను కలిసిన ఫీల్డ్ అసిస్టెంట్లు:

  ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు వైఎస్ జగన్‌రెడ్డిని కలిశారు. ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగిస్తామని చంద్రబాబు పేర్కొంటున్న నేపథ్యంలో వారు జగన్‌ను కలిశారు. తమ సమస్యలను ఏకరువు పెట్టారు. అనంతరం వైఎస్ జగన్‌రెడ్డికి వినతి పత్రం సమర్పించారు.

 

 వైఎస్ జగన్‌ను కలిసిన ఎమ్మెల్యేలు

 పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ఉన్న ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌రెడ్డిని శుక్రవారం పలువురు ఎమ్మెల్యేలు వచ్చి కలిశారు. ఎమ్మెల్యేలు దేవగుడి ఆదినారాయణరెడ్డి, పి.రవీంద్రనాథరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొండూరు ప్రభావతమ్మ, జమ్మలమడుగు మున్సిపల్ మాజీ చైర్మన్ తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, పులివెందుల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్‌రెడ్డి, జిల్లా మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, మార్కెట్ యార్డు మాజీ ైచె ర్మన్‌జగదేకరరెడ్డి తదితరులు వైఎస్ జగన్‌ను కలిశారు. వారితోపాటు పులివెందుల, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు, రాయచోటికి చెందిన కౌన్సిలర్లు కూడా వైఎస్ జగన్‌తో కరచాలనం చేసి పలు విషయాలు చర్చించారు.

 

 దాడులపై కఠినంగా వ్యవహరించాలి

 వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు జరుపుతున్న దాడులపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు.సింహాద్రిపురం మండలానికి చెందిన వైఎస్‌ఆర్ సీపీ నాయకులు వెలుగోటి చంద్రశేఖరరెడ్డి, పవన్‌కుమార్‌రెడ్డి, యూత్ కన్వీనర్ శివారెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు సోమశేఖరరెడ్డి తదితరులు ఆయనను కలిసి కోవరంగుంటపల్లెలో వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్త పెద్దబాదుల్లాపై టీడీపీ వర్గీయులు చేసిన దాడిని వివరించారు. వెంటనే స్పందించిన వైఎస్ జగన్ పోలీసులు ఇలాంటి సంఘటనలపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు.

 

 పర్యటన విజయవంతం  

 వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటన విజయవంతం కావడంతో కార్యకర్తలలో కొత్త ఉత్సాహం నెలకొంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన నాలుగు రోజులు ఉంటుందని భావించినా.. తూర్పుగోదావరి జిల్లా నగరంలో గ్యాస్ పైపులైన్ లీకేజీ అయి 15మంది చనిపోయిన నేపథ్యంలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటనను రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు.ఈనెల 26వ తేదీన బద్వేలు, కడపలోని పార్టీ కార్యాలయాల్లో ప్రత్యేకంగా కార్యకర్తలతో అభిప్రాయాలు స్వీకరించిన ఆయన రెండవ రోజు శుక్రవారం పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు కార్యకర్తలు, నాయకులు, ప్రజలతో మమేకమయ్యారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top