మహిళా మణులు | Sakshi
Sakshi News home page

మహిళా మణులు

Published Fri, Aug 28 2015 2:43 AM

మహిళా  మణులు

నిర్మల్ గ్రామ పురస్కారాలు అందుకున్న మహిళా సర్పంచ్‌లు
జిల్లాలో ఇద్దరికి.. ఆ రెండూ చల్లపల్లి మండలానికే
పురస్కారాలతో మరింత బాధ్యత పెరిగిందని వెల్లడి

 
ఆ ఇద్దరు మహిళలు శివారు గ్రామపంచాయతీలకు సర్పంచ్‌లు. అన్ని వసతులు ఉండి విద్యావంతులు, నిధులు దండిగా ఉండే పంచాయతీలు చేయలేని పనిని సవాల్‌గా చేసి చూపించారు. గ్రామీణ ప్రాంతం, అందునా నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండే శివారు పంచాయతీలైన యార్లగడ్డ, వెలివోలు సర్పంచ్‌లు యార్లగడ్డ సాయిభార్గవి, తలశిల విజయకుమారి పూర్తిస్థాయిలో  వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టడం ద్వారా ఇటీవల నిర్మల్ గ్రామపురస్కారాలను అందుకున్నారు. జిల్లాలో రెండు పంచాయతీలకు ఈ పురస్కారాలు లభించగా, ఆ రెండూ చల్లపల్లి మండలానివే కావడం, ఆయా గ్రామాల సర్పంచ్‌లు ఇద్దరూ మహిళలు  కావడం అభినందనీయం. సమర్థవంతమైన పాలకులు ఉంటే పల్లెలు సైతం పట్టణాలకు తీసిపోవని నిరూపిస్తున్న ఈ ఇద్దరు మహిళామణులపై ప్రత్యేక కథనం.    - చల్లపల్లి
 
చల్లపల్లి : రాష్ట్రంలో 2013 సంవత్సరానికి గాను నిర్మల్ గ్రామ పురస్కారాలకు 27 పంచాయతీలను ఎంపిక చేయగా అందులో రెండు జిల్లాకు దక్కాయి. ఆ రెండూ చల్లపల్లి మండలంలోని యార్లగడ్డ (యార్లగడ్డ సాయిభార్గవి-సర్పంచ్), వెలివోలు (తలశిల విజయకుమారి-సర్పంచ్) గ్రామపంచాయతీలకు రావడం, అందునా మహిళా సర్పంచ్‌లకు ఈ గౌరవం దక్కడం విశేషం. ఈ పురస్కారం ద్వారా యార్లగడ్డకు రూ.6 లక్షలు, వెలివోలుకు రూ.3 లక్షలు చొప్పున నగదు అవార్డు లభించింది. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు సిహెచ్.అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు చేతుల మీదుగా ఈ ఇద్దరు సర్పంచ్‌లు అవార్డులను అందుకున్నారు. తొలి విడతగా యార్లగడ్డకు రూ.1.50 లక్షలు, వెలివోలుకు రూ.75 వేలు చొప్పున చెక్కులు అందజేశారు.
 
 
 యార్లగడ్డకు పురస్కారం ఇలా..
 యార్లగడ్డ గ్రామపంచాయతీ 1950లో ఏర్పాటైంది. ప్రస్తుత జనాభా 1,950 మంది ఉండగా, యార్లగడ్డ సాయిభార్గవి సర్పంచ్‌గా ఉన్నారు. పంచాయతీ పరిధిలో 415 మరుగుదొడ్లు ఉండగా, 2013లో జాతీయ ఉపాధిహామీ పథకం కింద 47 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టినందుకు గాను నిర్మల్ గ్రామ పురస్కారం లభించింది. ఈ అవార్డు కింద ఇచ్చే రూ.6 లక్షలను పారిశుధ్యం, తాగునీటి అవసరాలకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

 పంచాయతీ ప్రత్యేకతలు ఇవే..
 జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య స్వగ్రామమిది. గ్రామంలో ఎటు చూసినా పచ్చని చెట్లు, పంట పొలాలతో అలరారుతుంటుంది. పంచాయతీ కార్యాలయానికి సమీపంలో ఉన్న 18 ఎకరాల చెరువు గ్రామానికి మణిహారంలా ఉంటుంది. చుట్టూ కొబ్బరిచెట్లతో ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది. గ్రామంలో ఎక్కడ చూసినా సీసీ, పక్కా రహదారులు దర్శనమిస్తుంటాయి. ఇటీవల గ్రామంలో డంపింగ్ యార్డును ఏర్పాటు చేశారు.
 
 మరింత బాధ్యత పెరిగింది

 నిర్మర్ పురస్కారంతో మాపై మరింత బాధ్యత పెరిగింది. గ్రామంలో గతంలో గ్రంథాలయం ఉండేది, ఇప్పుడు పనిచేయడం లేదు. దాన్ని పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలి. గ్రామంలో మరిన్ని మొక్కలను నాటి సంరక్షణకు చర్యలు చేపడతాం. చెరువు మధ్యలో ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం.             - యార్లగడ్డ సాయిభార్గవి, సర్పంచ్, యార్లగడ్డ
 
 వెలివోలును వరించిందిలా..
 వెలివోలు గ్రామపంచాయతీని 1958లో ఏర్పాటు చేశారు. ఈ పంచాయతీలో 1,650 మంది జనాభా ఉండగా, సర్పంచ్‌గా తలశిల విజయకుమారి పాలన సాగిస్తున్నారు. గ్రామంలో 362 మరుగుదొడ్లు ఉండగా, 2013లో జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా 42 మరుగుదొడ్లను నిర్మించడం ద్వారా నిర్మల్ గ్రామపురస్కారం లభించింది. దీని ద్వారా రూ.3 లక్షల నగదు అందజేస్తారు.

 పంచాయతీ ప్రత్యేకలు ఇవే
 ఈ పంచాయతీలో ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఉంది. మూడు కిలోమీటర్ల మేర గ్రామంలో 14 సిమెంట్ రహదారులున్నాయి. జెడ్పీ పరిధిలో శ్రీకాకుళం-నడకుదురులో రెండు కిలోమీటర్ల మేర తారు రోడ్డు, ఎనిమిది అంతర్గత రహదారులున్నాయి. మెట్ట పంటలకు ప్రసిద్ధి పొందిన ఈ పంచాయతీలో చెరుకు, అరటి వంటి వాణిజ్య పంటలు, ఉద్యాన వన పంటలతో పాటు పట్టు పరిశ్రమకు ప్రసిద్ధి గాంచింది.  
 
 పంచాయతీ భవనం నిర్మించాలి

 గ్రామంలో ఉన్న పంచాయతీ కార్యాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. దాని స్థానంలో నూతన భవనాన్ని నిర్మించాల్సి ఉంది. వ్యవసాయ, వాణిజ్య పంటలతో పాటు పట్టు పరిశ్రమను మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తాను.    - తలశిల విజయకుమారి, సర్పంచ్, వెలివోలు
 

Advertisement

తప్పక చదవండి

Advertisement