ప్రతి ఒక్కరినీ విద్యావంతులుగా తీర్చిదిద్దితేనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని పర్చూరు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.
ఒంగోలు కల్చరల్, న్యూస్‌లైన్: ప్రతి ఒక్కరినీ విద్యావంతులుగా తీర్చిదిద్దితేనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని పర్చూరు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఆయన రాసిన ‘ప్రపంచ దేశాలు-పాలనా వ్యవస్థలు’ పుస్తక పరిచయ కార్యక్రమాన్ని స్థానిక రంగా భవన్‌లో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా దగ్గుబాటి మాట్లాడుతూ ప్రపంచంలోని 30 దేశాల పాలనా వ్యవస్థల గురించి తాను చేసిన అధ్యయనాన్ని ఈ పుస్తకంలో పొందుపరిచినట్లు చెప్పారు. టీడీపీ ఆవిర్భావం నుంచి తాను ఆ పార్టీ చరిత్రకు ప్రత్యక్ష సాక్షినని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య మూలస్తంభాలుగా పేర్కొనే వ్యవస్థల్లో కూడా కాలానుగుణంగా మార్పులు, సంస్కరణలు తప్పక వస్తాయని వివరించారు. ఎన్నికల్లో డబ్బులు పంచే పార్టీలు, నాయకులపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం హెచ్చరికలు చేయడమే తప్ప గట్టి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. ఎన్నికల్లో డబ్బులు పంచే నాయకులు కొందరిని పోటీ చేయకుండా ఎన్నికల సంఘం నిషేధిస్తే అప్పుడన్నా మార్పు వస్తుందని చెప్పారు.
ఎన్నికల్లో లబ్ధిపొందడం కోసం అన్నీ ఉచితంగా ఇస్తామని హామీలిచ్చే పార్టీలను కూడా నిషేధించాలని అభిప్రాయపడ్డారు. న్యాయ వ్యవస్థలో మార్పు రావాలని, సత్వర న్యాయం జరుగుతుందనే విశ్వాసం ప్రజల్లో కలిగించాలని పేర్కొన్నారు. పత్రికా రంగానికి కూడా పూర్తి స్వేచ్ఛ, గౌరవం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ రాజకీయవేత్త అయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచయితగా మారి నాలుగు పుస్తకాలు రాయడం అభినందనీయమని పేర్కొన్నారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్ మాట్లాడుతూ ప్రజాసేవలో తరిస్తూనే దగ్గుబాటి గ్రంథ రచన చేయడం అభినందనీయమన్నారు. ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజీ నిర్వాహకుడు కంచర్ల రామయ్య మాట్లాడుతూ దగ్గుబాటి రచించిన ఈ పుస్తకాన్ని రాష్ట్రంలోని 700 ఇంజినీరింగ్ కాలేజీలకు పంపనున్నట్లు వెల్లడించారు.
ప్రకాశం జిల్లా రచయితల సంఘ అధ్యక్షుడు బీ హనుమారెడ్డి, ఇంకొల్లు డీఎన్‌ఎం జూనియర్ కాలేజీ తెలుగు అధ్యాపకుడు డాక్టర్ బీరం సుందరరావు పుస్తక సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యుడు పిడతల రాంభూపాలరెడ్డి, మాజీ మంత్రి ఆరేటి కోటయ్య, డాక్టర్ ఆలూరు ప్రభాకరరావు, బీజేపీ నాయకుడు బత్తిన నరసింహారావు, సీపీఐ నాయకుడు నల్లూరి వెంకటేశ్వర్లు, ఆచార్య రంగా కిసాన్ సంస్థ అధ్యక్షుడు ఆళ్ల వెంకటేశ్వరరావు, జనరల్ సెక్రటరీ చుంచు శేషయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుదర్శి వెంకట శేషయ్య, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఈదర మోహన్, కంచర్ల విజయభాస్కర్, బీ నరసయ్య తదితరులు ప్రసంగించారు. అనంతరం గ్రంథకర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావుతోపాటు అతిథులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. తొలుత జ్యోతిప్రజ్వలన చేయడంతోపాటు ప్రపంచ దేశాలు-పాలనా వ్యవస్థలు పుస్తకాన్ని సభలో ఆవిష్కరించారు. పెద్దసంఖ్యలో అభిమానులు, నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.