పెనుగొండ మరోసారి లాక్‌డౌన్‌

West Godavari: Lockdown Continues in Penugonda - Sakshi

ఒకే రోజు 12 మందికి కోవిడ్‌–19 నిర్ధారణ

పీహెచ్‌సీ సిబ్బందికీ కరోనా

ఆచంట–సిద్ధాంతం రహదారి బంద్‌

సాక్షి, పెనుగొండ (పశ్చిమగోదావరి జిల్లా): కోవిడ్‌–19 విజృంభణ అధికం కావటంతో అధికారులు, ప్రజలు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. రెండు రోజుల్లో 20 మందికి పైగా కరోనా సోకడంతో ఉలిక్కిపడుతున్నారు. అదుపులోకి వచ్చిందనుకున్న పరిస్థితి తారుమారు కావడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఈ నెల 19న కంటైన్‌మెంట్‌ జోన్‌ ఎత్తివేయడానికి సన్నాహాలు చేస్తున్న తరుణంలో ఒకేసారి అధిక సంఖ్యలో కోవిడ్‌–19 కేసులు నమోదు కావడంతో పెనుగొండను మరోసారి లాక్‌డౌన్‌ చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా ఆచంట మండలంలోనూ కేసులు పెరగడంతో అధికారులు కట్టుదిట్టం చేయడం ప్రారంభించారు. పెనుగొండలో గురువారం రాత్రి 12 మందికి కరోనా నిర్ధారణ కావడంతో వారిని హుటాహుటిన తాడేపల్లిగూడెం కోవిడ్‌ కేర్‌ సెంటర్‌కు తరలించారు. ఆచంట మండలంలో ఆరోగ్య సిబ్బందికి కరోనా సోకినట్లు అధికారులు నిర్ధారించారు. వల్లూరులో నలుగురికి కరోనా సోకింది. అయోధ్యలంకలో ఆరోగ్య సిబ్బందికి కరోనా సోకింది. దీంతో ఆయా ప్రాంతాల్లో కంటైన్‌మెంట్‌ జోన్లు ప్రకటించి నిషేధాజ్ఞలు జారీ చేశారు. (విషాదం: కొడుకు బిగ్గరగా అరిచి చెప్పడంతో..)

పెనుగొండలో కట్టుదిట్టం
పెనుగొండలో మరోసారి కరోనా విలయతాండవం చేయడంతో లాక్‌డౌన్‌కు అధికారులు సన్నాహాలు చేశారు. ఇప్పటివరకూ ఉదయం 11 గంటల వరకూ దుకాణాలకు అనుమతులు ఇచ్చారు. ఒకేసారి 12 కేసులు నమోదు కావడంతో దుకాణాలు పూర్తిగా మూసి వేయాలని ఆదేశాలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ రోడ్లుపైకి రావద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. అతిక్రమిస్తే జరిమానాలు విధించడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పెనుగొండలో ఆదివారం కర్ఫ్యూ స్థాయిలో కట్టుదిట్టం చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు ప్రతి బుధవారం కర్ఫ్యూ విధించటానికి సన్నాహాలు చేస్తున్నారు. మిగిలిన రోజుల్లో కూరగాయలు, నిత్యావసర వస్తువులు ఉదయం 10 గంటల వరకూ ఇళ్లకే పంపిస్తామని అధికారులు ప్రకటించారు. శుక్రవారం ఉదయం సీఐ పి.సునిల్‌కుమార్, ఎస్సై పి.నాగరాజు, తహసీల్దారు వై.రవికుమార్, ఎంపీడీఓ కె.పురుషోత్తమరావు పెనుగొండ ప్రధాన విధుల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనా కట్టడికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. (కంటతడి పెట్టిస్తున్న సూసైడ్‌ నోట్‌..)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top