రాష్ట్ర విభజనతో గోదావరి డెల్టాకు జరిగే నష్టాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యేలా ఇంజనీరింగ్ జేఏసీ అధికారులు రూపొందిం చిన కరపత్రం అందరిని ఆకట్టుకుంటోంది. కొవ్వూరులో సమైక్యాంధ్రకు మద్దతుగా శుక్రవారం నిర్వహించిన మహాధర్నాలో భాగంగా ఇంజనీరింగ్ జేఏసీ అధికారులు ఈ కరపత్రాన్ని విడుదల చేశారు.
కొవ్వూరు, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనతో గోదావరి డెల్టాకు జరిగే నష్టాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యేలా ఇంజనీరింగ్ జేఏసీ అధికారులు రూపొందిం చిన కరపత్రం అందరిని ఆకట్టుకుంటోంది. కొవ్వూరులో సమైక్యాంధ్రకు మద్దతుగా శుక్రవారం నిర్వహించిన మహాధర్నాలో భాగంగా ఇంజనీరింగ్ జేఏసీ అధికారులు ఈ కరపత్రాన్ని విడుదల చేశారు. గోదావరి డెల్టాలో 1956 నుంచి 2013 వరకు ఉన్న పరిస్థితిని, విభజన జరిగితే 2020 తరువాత ఏర్పడే సంక్షోభ పరిస్థితులను వివరించారు. తెలంగాణ ప్రాం తంలో నిర్మాణంలో ఉన్న ఎత్తిపోతల పథకాలు పూర్తయితే సెప్టెంబర్ 15 తరువాత ఎగువ నుంచి చుక్కనీరు కూడా దిగువకు వచ్చే పరిస్థితి లేదని ఇంజనీర్లు హెచ్చరిస్తున్నారు.
అక్టోబర్‌లో గోదావరిలో 30 క్యూసెక్కుల నీరు మాత్రమే ఉంటుందని, తద్వారా ఖరీఫ్ చివరిలో నీటి ఎద్దడి ఏర్పడుతుందంటున్నారు. గోదావరి డెల్టాతోపాటు కృష్ణా డెల్టాలకు సాగునీటి ఎద్దడిని నివారించాలంటే పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. తెలంగాణ ప్రాంత నాయకులు పోలవరం ప్రాజెక్టును వివాదాల్లోకి లాగి అవాంతరాలు సృష్టిస్తూ వారి ప్రాంతంలో శరవేగంగా ఎత్తిపోతల పథకాలను నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికాకపోతే భవిష్యత్‌లో కృష్ణా, గోదావరి డెల్టాతోపాటు సీమాంధ్ర ప్రాంతంలో 40 లక్షల ఎకరాలు బీళ్లుగా మారతాయంటున్నారు. సీమాంధ్రలో 540 మెట్ట గ్రామాలకు, 30 లక్షల మందికి తాగునీటి ఇబ్బందులు, 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనకు ఆటంకం కలుగుతుందని పేర్కొంటున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే కోస్తాతోపాటు రాయలసీమకు తాగునీరుతోపాటు సాగునీరు అందే అవకాశం ఉందని వారు కరపత్రంలో వివరించారు.