ఉగ్ర గోదారి

Water level at risk level at Dhavaleeswaram - Sakshi

ఉభయ గోదావరి జిల్లాల్లో 159 గ్రామాలు జల దిగ్బంధం 

ఒకరి మృతి.. ఇద్దరు గల్లంతు 

ధవళేశ్వరం వద్ద ప్రమాద స్థాయికి నీటిమట్టం 

తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు రాకపోకలు బంద్‌ 

సాక్షి, అమరావతి/రాజమహేంద్రవరం/ఏలూరు: గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఉభయ గోదావరి జిల్లాల్లో 159 గ్రామాలు ముంపుబారిన పడ్డాయి. సాయంత్రం 6 గంటలకు ధవళేశ్వరం బ్యారేజి వద్ద నీటిమట్టం ప్రమాదకర స్థాయిలో 15 అడుగులకు చేరుకుంది. ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా.. 14.70 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. భద్రాచలం వద్ద సాయంత్రం 6 గంటలకు 47.50 అడుగుల నీటిమట్టం నమోదైంది. తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ, ఏజెన్సీ మండలాల్లో 111 గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. పి.గన్నవరం, రాజోలు, కొత్తపేట, ముమ్మిడివరం, అమలాపురం, అయినవిల్లి మండలాల్లోని లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కూనవరం, వీఆర్‌ పురం మండలాల్లో 20 గ్రామాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. చింతూరు మండలంలో 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏపీ నుంచి తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.

దేవీపట్నం మండలంలో తొయ్యేరు, పూడిపల్లి తదితర 36 గ్రామాలు ఎనిమిదో రోజూ వరద ముంపులోనే ఉన్నాయి. రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల్లో 30 లంక గ్రామాల్లో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం, వేలేరుపాడు మండలాల్లో 39 గ్రామాలు జల దిగ్బంధంలో ఉండగా.. దిగువన ఆచంట, యలమంచిలి మండలాల్లో అనగారలంక, పెదమల్లంలంక, అయోధ్యలంక, పుచ్చల్లంక, మర్రిమాలలంక, దొడ్డిపట్ల పల్లెపాలెం, లక్ష్మీపాలెం, పెదలంక, కనకాయలంక గ్రామాల్లో వరద నీరు చేసింది. వేలేరుపాడు మండలంలోని రుద్రంకోట, రేపాకగొమ్ము, తిర్లాపురం, నాళ్లారం, కట్కూరు, కొయిదా సహా 13 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కుక్కునూరు మండలంలో గొమ్ముగూడెం, కౌండిన్యముక్తి గ్రామాలను వరద చుట్టుముట్టింది. పాత పోలవరంలోని నెక్లెస్‌ బండ్‌ కోతకు గురై గోదావరిలోకి అండలుగా జారుతూ భయపెడుతోంది. ఇదిలావుంటే.. వంశధార, నాగావళి నదుల్లో శుక్రవారం వరద తగ్గింది. 

ఒకరి మృతి.. ఇద్దరు గల్లంతు
తూర్పు గోదావరి జిల్లా అడ్డతీగల మండలం కొచ్చావారివీధి వద్ద జర్తా భద్రమ్మ అనే మహిళ మడేరు వాగులో కొట్టుకుపోయి మృతి చెందింది. ఇదే జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి కాజ్‌వేపై నడిచి వెళ్తున్న నమీర్‌బాషా (23), షేక్‌ రెహ్మాన్‌ అలియాస్‌ నాని (17) ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతు కాగా.. షేక్‌ వజీర్‌ అనే యువకుడిని స్థానికులు రక్షించారు. 

ముంపును జయించి పెళ్లాడింది
పెండ్లి కుమార్తెను ట్రాక్టర్‌పై ఏటిగట్టు దాటించి వివాహం జరిపించిన అరుదైన ఘటన తూర్పు గోదావరి జిల్లా పాశర్లపూడిలో చోటుచేసుకుంది. పెదపట్నంలంకకు చెందిన దేవిశ్రీకి శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు వివాహం నిశ్చయించారు. ఆమెను నగరం గ్రామంలోని వరుడు దాకే బాలరాజు ఇంటికి తీసుకు వెళ్లాల్సి ఉంది. ప్రధాన రహదారులన్నీ వరద ముంపులో చిక్కుకోవడంతో దేవిశ్రీని అప్పనపల్లి మలుపు వరకు కారులో తీసుకొచ్చారు. అక్కడి నుంచి ట్రాక్టర్‌పై ఏటిగట్టు దాటించి అనుకున్న సమయానికే వివాహ తంతును పూర్తి చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top