సాక్షిగా నేను నిలబడతా

Vizianagaram Corruption In Municipality - Sakshi

దమ్ముంటే డీసెంట్‌లపై విచారణ జరిపించండి

మున్సిపాలిటీలో అవినీతి నిజం నిగ్గు తేలుతుంది

వర్క్‌ ఇన్‌స్పెక్టర్ల నియామకాల్లో అవకతవకలు నిజం కాదా

మున్సిపల్‌ కౌన్సిల్‌ను నిలదీసిన ప్రతిపక్ష కౌన్సిలర్‌ ఎస్‌వీవీ రాజేష్‌

విజయనగరం మున్సిపాలిటీ : సాక్షిగా నేను నిలబడతా, కౌన్సిల్‌కు దమ్ముంటే ఇప్పటి వరకు నేను ఇచ్చిన డిసెంట్‌ నోట్‌లపై విచారణ జరిపించండి. పాలకవర్గం, అధికార యంత్రాంగం చేస్తున్న అవినీతి నిజాలు నిగ్గు తేలుతాయని  ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీకి చెందిన సీనియర్‌ కౌన్సిలర్‌ ఎస్‌వీవీ రాజేష్‌ సవాల్‌ విసిరారు. గురువారం మున్సిపల్‌ చైర్మన్‌ ప్రసాదుల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్‌ సాధారణ సమావేశం వాడీవేడీగా సాగింది. అజెండాలోని 23 అంశం చర్చకు వచ్చిన సమయంలో గ్రాడ్యుయేటెడ్‌ టెక్నికల్‌ వర్క్‌ ఇన్‌స్పెక్టర్స్‌ను 12 నెలల కాలపరిమితికి నియమించుకోవడంపై రాజేష్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ చైర్మన్‌కు ఆ అంశాన్ని వ్యతిరేకిస్తూ డీసెంట్‌ నోట్‌ ఇచ్చారు.

ఈ సందర్భంగా రాజేష్‌ మాట్లాడుతూ మొత్తం 12 మంది ఇన్‌స్పెక్టర్‌ల నియామకాల్లో అవతవకలు చోటు చేసుకున్నాయని, డబ్బులు తీసుకుని నియామకాలు చెపట్టారని ఆరోపించారు. వారిని పంపిణీ చేసే విశాఖకు చెందిన  సినెర్జీ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థ స్వయానా మున్సిపల్‌ ఇంజినీర్‌ రాజేంద్రకృష్ణ బినామీ సంస్థగా పేర్కొన్నారు. ఈ నియామకాల ద్వారా అవకతవకలు చోటు చేసుకోవడంతో పాటు భవిష్యత్‌లో భారీ అవినీతి చోటు చేసుకునే అవకాశం ఉందని సభ దృష్టికి తీసుకొచ్చారు.

నకమహాలక్ష్మి ఇన్‌చార్జి కమిషనర్‌గా ఉన్న సమయంలో వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని పట్టణంలో అభివృద్ధి  స్తంభించటానికి బినామీలే కారణమంటూ తూర్పరబట్టారు. ప్రతిపక్షం డిసెంట్‌ నోట్‌ ఇవ్వడంపై స్పందించిన అధికార పార్టీ కౌన్సిలర్లు కేవలం అధికారులను బెదిరించేందుకు ఇలాంటి నోట్‌ ఇస్తున్నారని మాటల దాడికి దిగడంతో స్పందించిన ప్రతిపక్ష కౌన్సిలర్‌ ధీటుగా  సమాధానమిచ్చారు. తాను ఇప్పటి వరకు ఇచ్చిన డీసెంట్‌ నోట్‌లపై విచారణ జరిపించాలని సవాల్‌ విసిరారు.

 ఇంజినీరింగ్‌ అధికారులపై విరుచుకుపడ్డ కౌన్సిల్‌..

మున్సిపాలిటీని ప్రగతి పథంలో నడిపించాల్సిన ఇంజినీరింగ్‌ అధికారుల తీరుపై గురువారం మున్సిపల్‌ కౌన్సిల్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. నెలల తరబడి వీధి దీపాలు వెలగకున్నా కుంటి సాకులతో నెట్టుకురావడంపై 21వ వార్డు కౌన్సిలర్‌ గేదెల ఆదినారాయణ ఆగ్రహంతో ఊగిపోయారు. రూ.200లకే మంచి నీటి కుళాయిల మంజూరుపై మున్సిపల్‌ చైర్మన్‌ ప్రసాదుల రామకృష్ణ మండిపడ్డారు. ఈ సమయంలో మున్సిపల్‌ ఇంజినీర్‌ రాజేంద్రకృష్ణ వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించగా,  చైర్మన్‌ అవసరం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇంజినీరింగ్‌ అధికారుల తీరుతో కౌన్సిలర్లు తలదించుకోవాల్సి వస్తోంది. లొసుగులు లేకుంటే టెండర్లను కౌన్సిల్‌కు చూపడానికి ఎందుకు వెనుకంజ వేస్తున్నారంటూ ఫైర్‌ అయ్యారు. ఏసీ సంతకాలు చేసిన టెండర్లను కౌన్సిల్లో ఎందుకు ప్రవేశపెట్టలేదని ప్రశ్నించారు. అసలు మున్సిపాలిటీలో ఏపీఎండీపీ స్కీం, అమృత్‌ స్కీంల అమలుపై అవగాహన ఉందా అంటూ ప్రశ్నించారు. ఇంజినీరింగ్‌ అధికారుల నిర్వాకంతో అభివృద్ధి పనుల్లో జాప్యం చోటు చేసుకుంటుందని, నిధులు వినియోగంలో నిర్లక్ష్యం వహించడంతో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద మంజూరైన కోట్లాది నిధులు వెనక్కి మళ్లిపోయే పరిస్థితి దాపురించిందని ఇలా అయితే  వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ఎప్పటికి జరుగుతుందని 1వ వార్డు కౌన్సిలర్‌ సోము స్రవంతి ప్రశ్నించారు.

స్వయానా జిల్లా కలెక్టర్‌ వార్డుల్లో పర్యటించడం చూస్తుంటే  కౌన్సిల్‌ పనితనం ఏంటో ప్రజలకు సందేశం వెళ్లిపోయిందని, మున్సిపాలిటీలో అధికారులు పని చేస్తున్నారా అంటూ 24వ వార్డు కౌన్సిలర్‌ రొంగలి రామారావు నిలదీశారు. సమావేశంలో లైటింగ్‌ సమస్యపై స్పందించిన మున్సిపల్‌ కమిషనర్‌ టి.వేణుగోపాలరావు మాట్లాడుతూ రానున్న రెండు మూడు రోజుల్లో శతశాతం వీధి దీపాలు వెలిగేలా చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చారు. సమావేశంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కనకల మురళీమోహన్, అసిస్టెంట్‌ కమిషనర్‌ కె.కనకమహాలక్ష్మి, ఇతర కౌన్సిల్‌ సభ్యులు, వివిధ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top