
కేకే లైన్‌లో విరిగిపడిన కొండచరియలు
కొత్తవలస-కిరండోల్ లైన్లో పలు రైళ్లరాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
పట్టాలు తప్పిన గూడ్‌స రైలు
కిరండూల్-విశాఖ పాసింజర్ రద్దు
పలు గూడ్స్ రైళ్లు దారిమళ్లింపు
అనంతగిరి/విశాఖపట్నం : కొత్తవలస-కిరండోల్ లైన్లో పలు రైళ్లరాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీవర్షాలకు చిముడుపల్లి- బొర్రాగుహలు సెక్షన్‌లో కొండచరియలు విరిగిపడటంతో కిరండోల్ నుంచి విశాఖ వస్తున్న గూడ్స్‌రైలు పట్టాలు తప్పింది. సమాచారం అందుకున్న రైల్వే ఉన్నతాధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకుని యుద్ధప్రాతిపదికన పనులను వేగవంతం చేశారు. ఇటు విశాఖపట్నం అటు కోరాపుట్ నుంచి మధ్యాహ్నం 2 గంటల సమయంలో రెండు యాక్సిడెంట్ రిలీఫ్ రైళ్లు అక్కడికి బయలుదేరి వెళ్లాయి. క్రేన్ సహాయంతో కొండచరియలను తొలగించేపనిలో నిమగ్నమయ్యారు.
రైళ్లు రద్దు: కేకే లైన్‌లో కొండచరియలు విరగిపడటంతో కిరండోల్-విశాఖపాసింజర్‌ను రైల్వే శాఖ రద్దు చేసింది. ఇప్పటికే అదే లైన్‌లో రాకపోకలు సాగించాల్సిన 9 గూడ్స్‌రైళ్లను వయా రాయగడ మీదుగా మళ్లించారు.
అరకు వరకే రైళ్లు: గురువారం కిరండోల్ నుంచి విశాఖ బయ లు దేరి రావాల్సిన కిరండోల్- విశాఖపట్నం(58502) పాసింజర్ అరకు వరకూ మాత్రమే నడుపుతున్నట్టు రైల్వే వర్గాలు తెలిపాయి. అలాగే శుక్రవారం విశాఖ నుంచి బయలుదేరి కిరండోల్ వెళ్లాల్సిన పాసింజర్ (58501) అరకు నుంచి బయలుదేరి వెళ్లనుంది.