రామాయపట్నం పోర్టు నిర్మాణాన్ని వెంటనే చేపట్టండి 

Vijayasai Reddy Comments On Ramayapatnam Port Construction Works - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రామాయపట్నంలో భారీ పోర్టు నిర్మాణ పనులను సత్వరమే ప్రారంభించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం రాజ్యసభ జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. విభజన చట్టం ప్రకారం కేంద్రసాయంతో నిర్మించాల్సిన దుగరాజపట్నంలో పోర్టుకు లాభదాయకత లేదని తేలిన తర్వాత ప్రత్యామ్నాయంగా ప్రకాశం జిల్లా రామాయపట్నంలో నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు విజయసాయిరెడ్డి చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి మేజర్‌ పోర్టు నిర్మాణానికి అనుమతులు సాధించడానికి బదులుగా గత ప్రభుత్వం రామాయపట్నంలో సొంతంగానే నాన్‌మేజర్‌ పోర్టు నిర్మించాలని నిర్ణయించిందన్నారు. కానీ నేటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉందని, రామాయపట్నంలో నాన్‌మేజర్‌పోర్టు స్థానంలో కేంద్ర ప్రభుత్వం హామీ మేరకు మేజర్‌ పోర్టు నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వమే పోర్టు నిర్మాణ బాధ్యతలను చేపట్టి త్వరితగతిన పూర్తి చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం అమలులోకి వచ్చి ఇప్పటికే ఐదేళ్లు పూర్తయినా రామాయపట్నం పోర్టు నిర్మాణం హామీని నెరవేర్చాలంటూ ఇప్పటికీ తాము పార్లమెంటులో గొంతెత్తి అరవవలసి రావడం దురదృష్టకరమన్నారు.  

ఆడిట్‌ పూర్తయిన తర్వాతే పోలవరానికి నిధులు 
పోలవరం ప్రాజెక్ట్‌పై వెచ్చించిన వ్యయం రీయింబర్స్‌మెంట్‌ విషయంలో రూ.3,222.75 కోట్ల మేర పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని విడుదల చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తితోపాటు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి సవరించిన నిర్మాణ వ్యయం అంచనాలను ఆమోదించే అంశాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందా? అని సోమవారం ప్రశ్నోత్తరాల్లో వి.విజయసాయిరెడ్డి కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌ను ప్రశ్నించారు. దీనికి మంత్రి జవాబిస్తూ పోలవరం ప్రాజెక్ట్‌ను జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించడానికి ముందు చేసిన రూ.5 వేల కోట్ల ఖర్చుకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ ఆడిట్‌ జరుపుతోందని, ఇప్పటి వరకు రూ.3 వేల కోట్ల మేరకు ఆడిట్‌ పూర్తయినందున అందులో కొంత మొత్తం విడుదల చేసే అంశం ప్రస్తుతానికి ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్నట్లు చెప్పారు.

ఇదే అంశంలో ఎంపీ కేవీపీ రామచంద్రరావు అడిగిన రాతపూర్వక ప్రశ్నకు జలశక్తి మంత్రి రతన్‌లాల్‌ కటారియా సమాధానం ఇచ్చారు. 31.03.2014 నాటికి అయిన వ్యయం రూ.5,135.87కు సంబంధించి ఆడిట్‌ నివేదికలు సమర్పించాలని 2018 జూలై, 2019 మే, 2019 జూలై నెలల్లో అడిగామన్నారు. ఇప్పటి వరకు రూ.3,777.44 కోట్ల మేర ఆడిటింగ్‌ పూర్తయిందని రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చిందని వివరించారు. కేంద్ర ఆర్థిక శాఖ మధ్యంతర చర్యగా రూ.1,850 కోట్ల మేర ప్రాజెక్టుకు నిధులు ఇచ్చేందుకు ఈ శాఖకు అనుమతి ఇచ్చిందని వివరించారు. కాగా, 26.11.2019న ఆర్థిక శాఖ ఒక లేఖ రాసిందని, దీని ప్రకారం గతంలో ఇచ్చిన షరతుల (ఆడిట్‌ నివేదిక సమర్పణ)ను సంతృప్తి పరచనంతవరకు తదుపరి నిధుల విడుదల ఉండదని మంత్రి పేర్కొన్నారు.

ఏపీ మొత్తం అప్పులు రూ.3.41 లక్షల కోట్లు 
ఆంధ్రప్రదేశ్‌ మొత్తం అప్పు 2019–20 బడ్జెట్‌ అంచనాల ప్రకారం రూ.3,41,270 కోట్లుగా ఉందని, 2018–19 సవరించిన అంచనాల ప్రకారం ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ.3,06,010 కోట్లుగా ఉందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ వంగా గీతావిశ్వనాథ్‌ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. అలాగే తెలంగాణ అప్పులు 2018–19 చివరినాటికి సవరించిన అంచనాల ప్రకారం రూ.1.44 లక్షల కోట్లుగా ఉందని, 2019–20 బడ్జెట్‌ అంచనాల ప్రకారం రూ.1.68 లక్షల కోట్లుగా ఉందని వివరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top